ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం
పీఆర్‌టీయూ టీఎస్ మండల శాఖ అధ్యక్షుడు అడిచర్ల రాజయ్య
వెంకటాపూర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పీఆర్‌టీయూ టీఎస్ మండల శాఖ(PRTU TS Mandal Branch) అధ్యక్షుడు అడిచర్ల రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని వివిధ పాఠశాలల్లో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఫారాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు ఒక వజ్రాయుధంలా పనిచేస్తుందని, మండలంలో విధులు నిర్వహిస్తున్న పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ఇతర అర్హులైన పట్టభద్రులు కూడా తమ ఓటును నమోదు చేసుకోవాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఓటరు నమోదుపై ఆశించిన స్థాయిలో స్పందన లేదని, నవంబర్ 6 చివరి గడువు కావడంతో అర్హులందరూ సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఓటరు నమోదులో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే పీఆర్‌టీయూ టీఎస్ మండల శాఖ నాయకులను సంప్రదించాలని, వారి తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించి ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సలేంద్రం, శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి రాజేందర్, రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.