కలప స్మగ్లింగ్‌లో మహిళ కీలక పాత్ర!

27-11-2026 | 02:16pm

జిట్రేగి దుంగల అక్రమ రవాణా వెనుక అసలు కథ ఏమిటి?

కూలీల విచారణలో వెలుగులోకి వస్తున్న కీలక విషయాలు..!

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దేవాదుల పంప్‌హౌస్ సమీప అటవీ ప్రాంతంలో ఈ నెల 16వ తేదీన జిట్రేగి కలప దుంగల(Jitregi timber logs)తో వెళ్తున్న మినీ డీసీఎం వాహనం(Mini DCM vehicle) బోల్తా పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన వాహనాన్ని స్మగ్లర్లు అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం. అదే సమయంలో టేకు దుంగలతో వెళ్తున్న మరో వాహనం అటవీ సిబ్బందికి కనిపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అయితే టేకు దుంగలు మాయమైనట్లు, జిట్రేగి కలప అక్రమ రవాణాకు సంబంధించి కొందరిని అటవీ అధికారుల(Forest officials)కు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై అటవీ అధికారులు పలు కోణాల్లో విచారణ చేపట్టగా, కింది స్థాయి అటవీ సిబ్బందిలో కొందరు డబ్బులు తీసుకుని కలప స్మగ్లర్లకు సహకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.

తీగ లాగితే డొంక కదిలినట్లు

అటవీ అధికారులు, పోలీసుల విచారణలో గూర్రేవుల గ్రామానికి చెందిన ఓ బీసీ మహిళ పాత్ర తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కన్నాయిగూడెం, గూర్రేవుల గ్రామాలకు చెందిన కూలీలను అటవీ ప్రాంతానికి పంపించి జిట్రేగి చెట్లను నరికించి, మినీ డీసీఎం వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

ఈ కలప అక్రమ రవాణా వెనుక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన స్మగ్లర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలీలు అందించిన సమాచారంతో సదరు మహిళను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మహిళ విచారణతో మరిన్ని వివరాలు వెలుగులోకి

ఈ వ్యవహారంలో మహిళ పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే కలప అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు వ్యక్తులు, స్మగ్లర్ల నెట్‌వర్క్‌, వారికి సహకరించిన వారి వివరాలు బయటపడే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. కన్నాయిగూడెం మండలంలో కలప అక్రమ రవాణా వ్యవహారంలో ఓ మహిళ పేరు ప్రధానంగా వినిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో అటవీ శాఖ అధికారులు, పోలీసులు చేపట్టే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు