మరణించినా ఆయన కళ్ళు సజీవం.!
జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన పర్ల మహేష్ (38) గత 10 సం రాల క్రితం జగిత్యాల(Jagtial )కు చెందిన నందిని ని (30) వివాహం చేసుకుని భీష్మ నగర్ లో నివాసముంటు చలువ పందిర్లు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం హిమాన్షు (07), శ్రీ యాన్స్ (02). గత నవంబర్ 19న తన ద్విచక్ర వాహనం పై స్వగ్రామం వెళ్లి వస్తుండగా రాంపూర్ శివారులో మలుపు దగ్గర అదుపుతప్పి కింద పడి తీవ్రగాయాలు కాగా బాటసారులు గమనించి 108 కి సమాచారం అందించడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి తదుపరి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్ళాలని వైద్యులు సూచించడంతో ప్రతిమ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదం(Road accident)లో తీవ్రంగా గాయపడి వెన్నుపూస కు బలమైన దెబ్బ తగలడం వల్ల విరిగిన ఎముకకు శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయించారు.
ఇంతలో రక్తపోటు ఎక్కువై పరిస్థితి విషమించి మహేష్ మృతి చెందగా మృతుని భార్య, కుటుంబ సభ్యులు కలిసి నేత్రదానం చేయడానికి ముందుకు రావడంతో హైదరాబాద్ ఎల్ వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ దువాసి నాగరాజు ని సంప్రదించడంతో హెచ్వోడి డాక్టర్ శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించి హైదరాబాద్ ఎల్ వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా స్వచ్చందంగా నేత్ర దానంకు ముందుకు వచ్చిన మహేష్ సతీమణి ని, కుటుంబ సభ్యులను డాక్టర్ శెట్టి శ్రీనివాస్ అభినందించారు. నేత్రదానం చేసిన మహేష్ మరణించినా చిరంజీవి గా నిలుస్తారని డాక్టర్ శెట్టి శ్రీనివాస్, దువాసి నాగరాజు లు కొనియాడారు. ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచించి నేత్రదానం కి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.