బోధన్ నుంచి బరిలోకి కవిత
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు!
జిల్లాలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి – ఎమ్మెల్యేలే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు?
బోధన్,(విజయ క్రాంతి): సొంత జిల్లా నిజామాబాద్‌లో రాజకీయంగా తిరిగి పట్టు సాధించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kalvakuntla Kavitha) పావులు కదుపుతున్నారు. గతంలో ఎంపీగా ఓటమి చవిచూసిన జిల్లాలోనే తిరిగి తన రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం(Bodhan constituency) నుంచి పోటీ చేయనున్నట్లు కవిత స్పష్టం చేయడంతో జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
కార్తీక పూజల సందర్భంగా నిజామాబాద్‌కు వచ్చిన కవిత, వచ్చే ఎన్నికల్లో బోధన్ నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో తిరిగి పార్టీ ప్రాబల్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఆమె కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
గత పరిణామాలపై గురి
బీఆర్ఎస్ పదేళ్ల పాలన సమయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కవిత కీలక పాత్ర పోషించారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆమె ప్రభావం ఎక్కువగా ఉండేదని అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ సాగేది. అయితే ఈ పరిణామాలు కొందరు ఎమ్మెల్యేలతో విభేదాలకు దారితీశాయని, ఎంపీ ఎన్నికల సమయంలో అంతర్గత రాజకీయాలు ఆమె ఓటమికి కారణమయ్యాయని కవిత గతంలో ఆరోపించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు.
తన ఓటమికి పార్టీకి చెందిన కొందరు నేతలు సహకరించలేదని కవిత అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అనంతర పరిణామాలతో ఆమె జిల్లా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీగా రెండు పర్యాయాలు పనిచేసినప్పటికీ జిల్లాలో రాజకీయంగా మునుపటి స్థాయిలో క్రియాశీలకంగా కనిపించలేదు.
పాంచజన్య సభతో కొత్త ఉత్సాహం
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన అనంతరం కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాంచజన్య సభకు స్పందన రావడంతో ఆమె రాజకీయ కార్యాచరణపై చర్చ మొదలైంది.
ఈ సభలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి వంటి జిల్లాకు చెందిన కీలక నేతలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు తన రాజకీయ ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇవ్వాలనే వ్యూహంతో ఆమె ముందుకు సాగుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
బోధన్పైనే ఎందుకు దృష్టి?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నుంచి పోటీ చేయాలని కవిత నిర్ణయించుకోవడం వెనుక నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు కీలకంగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, సీనియర్ నేత పి. సుదర్శన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే షకీల్ వివిధ కేసుల నేపథ్యంలో దుబాయ్‌లో ఉంటుండగా, ఆయన కుటుంబం నుంచి ఆయన సతీమణిని రాజకీయ బరిలోకి దించే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గం తన రాజకీయ భవిష్యత్తుకు అనువైన వేదికగా కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో అప్పటి రాజకీయ పరిణామాలు, పార్టీ బలాబలాలు, స్థానిక నేతల మద్దతు కీలకంగా మారనున్నాయి.
ముందున్నది రాజకీయ సమీకరణాలే!
జిల్లాలో పార్టీ బలోపేతం, కొత్త నేతల చేరికలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమీకరణపై కవిత దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తొలుత ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోయినా రానున్న రోజుల్లో కీలక నేతలు తనతో కలిసి వస్తారనే ఆశాభావంతో ఆమె ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
మొత్తంగా బోధన్ నుంచి పోటీ చేస్తానని కవిత చేసిన ప్రకటనతో నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల వేడి మొదలైనట్లయింది. రాబోయే రోజుల్లో ఆమె చేపట్టే కార్యక్రమాలు, స్థానిక నాయకులతో సంబంధాలు, ఇతర పార్టీల నుంచి జరిగే చేరికలు బోధన్‌తో పాటు జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.