బిల్లు పడేది ఎప్పుడు..? ప్రజలకు అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు..?
కన్నాయిగూడెం, నవంబర్ 28 (విజయక్రాంతి): ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం దాదాపు రూ.3 లక్షలు వెచ్చించి నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు (Public Toilets) ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రజలు, రైతులు, వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం స్వచ్ఛ భారత్ (Swachh Bharat) కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. అయితే నిర్మాణ పనులు పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. దాదాపు రూ.3 లక్షల ప్రజాధనంతో నిర్మించిన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టాయిలెట్ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసిన అధికారులు వాటిని ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభించకుండా వదిలేయడానికి కారణాలేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నీటి సౌకర్యం, విద్యుత్, పారిశుద్ధ్యం (Sanitation), నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయా లేదా అన్నది అధికారులు స్పష్టం చేయాలని కోరుతున్నారు.
ప్రజా అవసరాల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆస్తులు కేవలం భవనాలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడినప్పుడే వాటి నిర్మాణానికి సార్థకత చేకూరుతుందని స్థానికులు అంటున్నారు. నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఎంతవరకు చెల్లించారు? ఏ ప్రాతిపదికన చెల్లింపులు జరిగాయి? టాయిలెట్లను ప్రారంభించకుండా ఎందుకు వదిలేశారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే ప్రారంభించడంతో పాటు నిరంతర నిర్వహణ (Maintenance)కు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మండల కేంద్రంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను రెండు రోజుల్లో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ రాము తెలిపారు. కాంట్రాక్టర్కు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించామని, కొంత మొత్తం పెండింగ్లో ఉందని వివరించారు. త్వరలోనే పెండింగ్ బిల్లు కూడా క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.