పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు ‘ఫిట్ కాప్’ యాప్

28-11-2026 | 03:25pm

కొత్తగూడెం, నవంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌తో పాటు ఇతర సంస్థల సహకారంతో రూపొందించిన ఫిట్ కాప్ యాప్ (Fit Cop App) వినియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ శిక్షణ చేపట్టారు. విధి నిర్వహణలో పని ఒత్తిడి (Work Stress), అధిక పని భారం కారణంగా పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపలేకపోతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం.

శిక్షణలో భాగంగా ఫిట్ కాప్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య వివరాలను నమోదు చేసే విధానం, శారీరక పరీక్షలకు సంబంధించిన రీడింగ్స్ తీసుకోవడం, వాటిని యాప్‌లో పొందుపరచడంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు (Blood Pressure), శరీర ద్రవ్యరాశి సూచీ (BMI), ఇతర ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు, వ్యాయామానికి సంబంధించిన వివరాలను నమోదు చేసే విధానాన్ని వివరించారు.

ఈ సందర్భంగా డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి మాట్లాడుతూ.. ఫిట్ కాప్ యాప్ ద్వారా పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే (Health Monitoring) అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందించవచ్చని తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బంది తమ పోలీస్ స్టేషన్లలోని ఇతర ఉద్యోగులకు కూడా యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు రాము, రమాకాంత్, ఇంద్రసేనారెడ్డి, నాగబాబు, ఎల్లయ్య, కరుణాకర్, సురేష్, నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు నరసింహారావు, లాల్‌బాబు, కృష్ణారావు, పోలీసు అధికారులు, టెక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు