గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
గోదావరి పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ
ములుగు సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : గోదావరి పుష్కరాల(Godavari Pushkarala) సందర్భంగా టైర్–1,2,3లో ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులు అమలయ్యేలా అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య(Sailaja Ramaiyer) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిపాదనలు, పరిపాలనా ప్రక్రియలకే పరిమితం కాకుండా వీలైనంత త్వరగా పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించి పూర్తి అయ్యే విధముగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
శనివారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య, కమిషనర్ హనుమంతరావుతో(Commissioner Hanumantha Rao) కలిసి సంబంధిత జిల్లా కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్(Video conference) ద్వారా సమీక్ష నిర్వహించారు. ములుగు(Mulugu) సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కోసం టైర్–1,2,3లో ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇందుకోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసి, పనులు క్షేత్రస్థాయిలో వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి ఆమోదం పొందిన ప్రతిపాదనల ప్రకారం పనులు ప్రారంభించాలని ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేలా అవసరమైన కార్మికులు, నిర్మాణ సామగ్రిని ముందుగానే సమీకరించాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, పనుల్లో ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని నాణ్యతతో పాటు నిర్ణీత సమయంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. టెండర్లకు కాంట్రాక్టర్లు స్పందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇంజనీరింగ్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే, మంత్రులతో కూడా సమన్వయం చేసుకొని పనులకు సంబంధించిన ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు.
అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ టైర్ 1,2,3లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలని, టెండర్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని ఆదేశించారు. కాంట్రాక్టర్లు టెండర్లకు స్పందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పుష్కరాల పనులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.