నడిగడ్డలో 14 టిప్పర్ల అక్రమ ఇసుక పట్టివేత
అధికారులకు, ఇసుక అక్రమార్కులకు మధ్య వాగ్వాదం
ఇసుకను చిన్నముద్దునూరు పీఏసీఎస్ కార్యాలయానికి తరలింపు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) తెలకపల్లి మండలం నడిగడ్డలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు గుర్తించి 14 టిప్పర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ విజయ్ కుమార్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నీలిమ(Gram Panchayat Secretary Neelima), హెడ్ కానిస్టేబుల్ సురేందర్, సిబ్బంది ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిస్థితిని పర్యవేక్షించిన అధికారులకు, ఇసుక అక్రమార్కులుగా పేర్కొంటున్న వ్యక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై రమేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం 14 టిప్పర్ల ఇసుకను చిన్న ముద్దునూరు పీఏసీఎస్ కార్యాలయానికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.