గడప ముందుకే దళారులు?

23-11-2026 | 05:10am
  1. కళ్ళముందే తెల్ల బంగారం దోపిడీ
  2. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తికి దక్కని ధర 
  3. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న పత్తి మిల్లులు
  4. అధిక ధర ఆశ చూపి గ్రామాల్లో తిరుగుతున్న పత్తి దళారులు
  5. ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలతో బురిడీ
  6. ఒక్కో క్వింటాల్ తూకంలో 20 కిలోలకు పైగా లూటీ
  7. రిమోట్ కంట్రోల్‌తో రైతుల ముందే మోసాలు
  8. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

నాగర్ కర్నూల్, నవంబర్ 22 (విజయక్రాంతి): ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పండించిన పత్తి పంటను తీరా అమ్ముకునేందుకు రైతాంగం అష్ట కష్టాలు పడుతోంది. ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాలు(Government CCI procurement centers) ఏర్పాటు చేసినప్పటికీ మినిమం సపోర్ట్ ప్రైస్(Minimum Support Price)  ( ఎంఎస్పి ) క్వింటా 8,267 ధర నిర్ణయించడంతో రైతులు ఆశించిన స్థాయిలో ధర దక్కలేదని అమ్మకాలకు ముఖం చాటేస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన పత్తి జిన్నింగ్ మిల్లర్లు, మధ్య దళారీలు అధిక ధర క్వింటాల్కి 9వేలు ఇస్తామంటూ ఆశ చూపి గ్రామాల్లోని రైతుల గడప వద్దకే ఎలక్ట్రానిక్ కాంటాలను తెచ్చి పత్తి కొనుగోలు చేస్తూ జీరో దందా చేపడుతున్నారు. ఈ క్రమంలో తూకాల్లో భారీగా మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆయా గ్రామాల్లో దలారుల వద్ద గొడవలకు దిగుతున్నారు. రైతుల కళ్ళముందే ఎలక్ట్రానిక్ రిమోట్ యంత్రాలతో ఒక్కో తూకం మీద సుమారు 20 కిలోల మేర మోసాలకు పాల్పడుతున్నట్లు గ్రహించి ఆయా పోలీస్ స్టేషన్ లకు పట్టిస్తున్నారు.

అయినప్పటికీ ఆయా పొలిటికల్ లీడర్ల కుడి ఎడమ భుజం ఖద్దరు చొక్కా లీడర్లు దళారులను వెనకేసుకురావడంతో పోలీసు అధికారులు చర్యలకు వెనకాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం క్రితం అచ్చంపేట, బల్మూర్, వంగూర్ మండలాల్లో పత్తి దళారులు రైతులను మోసగిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు వాహనాలతో సహా పట్టించినప్పటికీ ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. నాగర్ కర్నూల్, తాడూరు, బిజినపల్లి, తిమ్మాజీపేట మండలాల్లోనూ గ్రామాల్లోకి వెళ్లిన పత్తి దళారులు మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా వానాకాలం 2026 సీజన్‌లో 2,59,967 ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేయగా సుమారు 2,85,963 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండగా 11 మిల్లులో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కానీ రైతులు యాప్ నమోదు చేసేందుకు వెనకాడుతుండడంతో నేరుగా మిల్లర్లు వేయింగ్ మిషన్ల ద్వారా కొనుగోలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 4వేల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. సీసీఐ అధికారుల ప్రమేయం లేక పోవడంతో వేయింగ్ మిషన్ తూకాల్లోనూ భారీగా మోసాలకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. చిన్న సన్న కారు రైతులు సాగు చేసిన పత్తిని ఆయా గ్రామాల్లోకి భారీ లారీలు ఇతర వాహనాల ద్వారా పత్తి కొనుగోలు చేసే క్రమంలో దళారులు రైతులను నిలువుదోపిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు చేపడతాం

సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినప్పటికీ రైతులు ఆప్ నమోదు చేసుకోవడం లేదు. గ్రామా ల్లోకి వెళ్తున్న పత్తి కొనుగోలుదారులు తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. నేరుగా జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోలు చేయాలి. 

 నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి.


మరిన్ని వార్తలు