కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
109 సెక్షన్ కింద అందరి పైన కేసులు నమోదు చేయాలి
కొల్లాపూర్ నవంబర్ 27: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం(Koderu Mandal) తీగలపల్లిలో బీఆర్ఎస్ నేత కన్నారెడ్డి భాస్కర్ రెడ్డిపై జరిగిన దాడి, హత్యాయత్నం ఘటనపై కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి(Former MLA Beeram Harshavardhan Reddy) తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటనలో నిందితులపై కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయకుండా డీఎస్పీ బుర్రె శ్రీనివాసులు నీరుగారే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డీఎస్పీ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధితులతో కలిసి శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న బీరం హర్షవర్ధన్ రెడ్డి. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు.
సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. భాస్కర్ రెడ్డిపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోడేరు పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.