లావుణి భూముల్లో అక్రమ లీజుల దందా
- ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ కోట్ల విలువజేసే భూములు..
- సాగు చేయకుండా కమర్షియల్ వ్యాపారాలు.
- ధనవంతుల చేతుల్లో పేదల భూములు.
- రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలు
నాగర్ కర్నూల్ నవంబర్ 10 (విజయక్రాంతి)పేదలకు వ్యవసాయం(Agriculture) చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వం పంపిణీ(Government distribution) చేసిన లావణి పట్టా భూములు(Lavani Patta Lands) ధనవంతుల చేతిలో పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుత మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు (నెల్లికొండ) గ్రామ శివారు సర్వే నంబర్ 361లో సుమారు 32 ఎకరాలకు పైగా ఉన్న లావణి పట్టా భూములను కొందరు పట్టాదారులు సాగు చేయకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలా లు అందుకుంటూనే ఇతరులకు అక్రమంగా లీజుకు ఇస్తూ వ్యాపారాలకు వినియోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యంత పేదరికంలో ఉన్న భూమిలేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకుని బతికేం దుకు ప్రభుత్వం ఈ భూములను కేటాయించింది. కానీ ప్రస్తుతం ఆ భూములు సాగుకు దూరమై, ఇతరుల చేతుల్లోకి వెళ్లి కోట్ల రూపాయల వ్యాపారాలకు వేదికగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లావణి పట్టాలపై భూములు పొందిన వారు స్వయంగా సాగు చేయకుండా, ఇతరులకు లీజుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధ మని తెలిసినా రాజకీయ ధన బలంతో ఈ లీజు దందాకు తెర లేపుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారుల మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది.
సమగ్ర విచారణ జరిపించాలి
తెలంగాణ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం-1977 ప్రకారం లావణి భూముల అక్రమ బదిలీలు, లీజులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం భూముల స్వాధీనంపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సర్వే నంబర్ 361లోని 32 ఎకరాలకు పైగా భూముల అసలు పట్టాదారులు ఎవరు ప్రస్తుతం సాగు చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్నదెవరు ఎవరికి లీజుకి ఇచ్చారనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పేదల సంక్షేమం కోసం కేటాయించిన భూములు పక్కదారి పట్టకుండా, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.