రాజకీయ ఒత్తిళ్లు..!
అయోమయంలో అధికారులు!
బిజినేపల్లి: ప్రభుత్వ భూముల ఖబ్జాలు, కొండ రాళ్ళ అక్రమ రవాణాలపై ఆయా శాఖల అధికారులు తీసుకునే చర్యల్లో రాజకీయ ఒత్తిళ్లు(Political Pressure) ఎక్కువ అవ్వడంతో వారు అయోమయంలో ఉన్నారు. ఇసుక అక్రమ రవాణా(Illegal sand transportation), రాళ్ళ అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణలు చేసిన వారు స్థానిక నేతలను కలిసి తమ వ్యాపారాలకు అడ్డు రాకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
మమ్మాయిపల్లి, శాయినుపల్లి, గంగారం, లట్టుపల్లి గ్రామాల పరిధిలో రాళ్ళ అక్రమ రవాణా, మొర్రం మట్టి అక్రమ రవాణా, ఖబ్జాలు చేసుకునే వారు బృందంగా ఏర్పడి అధికారుల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే స్థానిక నేతలను కలిసి అధికారులు, విలేకరులు తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు సహకరిస్తున్నారని మొర పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే చట్ట విరుద్ధమైన, అధికారుల పరిధిలో లేని పనులు చేసి పెట్టాలని కొందరు మండల నాయకులు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వారు జారీ చేసిన అల్టిమేటం అమలు కాకుంటే, ప్రతిపక్ష పార్టీలకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని, అధికార పార్టీ నాయకుల పనులను విస్మరిస్తున్నారని నేతలతో చెబుతున్నారు. స్థానిక కార్యకర్తల ఫిర్యాదులలో అధికారులకు నేతలకు సమన్వయం కొరవడి ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీంతో మండల ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నారని పలువురు మేధావులు అభిప్రాయ పడ్డారు.