హైదరాబాద్‌కు మరో 21 ఎంజీడీల తాగునీరు
హైదరాబాద్ (విజయక్రాంతి): శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలమండలి కీలక ప్రణాళిక (Project Plan) సిద్ధం చేసింది. నగర పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లో పెరుగుతున్న నీటి డిమాండ్‌ను తీర్చేందుకు ఉస్మాన్‌సాగర్ నుంచి అదనంగా రోజుకు 21 మిలియన్ గ్యాలన్ల (MGD) నీటిని తరలించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా షేక్‌పేట ఫిల్టర్ బెడ్స్ వద్ద అత్యాధునిక నీటి శుద్ధి కేంద్రం నిర్మించనుంది.
ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ నుంచి రోజుకు 20 నుంచి 25 ఎంజీడీల నీటిని వినియోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మరో 21 ఎంజీడీల శుద్ధి చేసిన నీరు నగరానికి అదనంగా అందనుంది. దీంతో పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా (Water Supply) మరింత మెరుగుపడనుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా పుప్పాలగూడ బీఆర్‌సీ నుంచి ఎంజీఐటీ వరకు ప్రతిపాదించిన 120 అడుగుల రహదారి వెంబడి రెండు భారీ పైప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నారు. 1,200, 1,300 మిల్లీమీటర్ల వ్యాసంతో సుమారు 10 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించనున్నారు.
ప్రాజెక్టు పనులు, రహదారి విస్తరణ పనులను సమన్వయంతో చేపట్టేందుకు జలమండలి ఎండీ కె. అశోక్‌రెడ్డి, హెచ్‌జీసీఎల్ ఎండీ ఉపేందర్‌రెడ్డి శనివారం ప్రతిపాదిత మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నిర్మాణంతోపాటే పైప్‌లైన్ల పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఒకే రహదారిని పలుమార్లు తవ్వాల్సిన అవసరం ఉండదని, ప్రజాధనం ఆదా కావడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
పైప్‌లైన్ల ఏర్పాటులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, భూసేకరణ, విద్యుత్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్ల అంశాలపై అధికారులు చర్చించారు. సాధ్యమైనంత వరకు ఇప్పటికే ఉన్న కండ్యూట్లు, బండ్‌ల వెంబడి పైప్‌లైన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని జలమండలి ఎండీ సూచించారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో భవిష్యత్తులో పెరిగే జనాభా, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా అదనపు తాగునీరు అందుబాటులోకి రానుంది. త్వరలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక, డిజైన్లను ఖరారు చేయనున్నారు.