ట్యాంకర్ నీళ్లతో పంటను కాపాడుకుంటున్న రైతు!

16-10-2026 | 04:42pm
  1. ఒక్కో ట్రిప్పునకు రూ.1,000.. పెట్టుబడులు భారంగా మారినా తప్పని తిప్పలు
  2. రామారెడ్డి మండలం లో పంటలను కాపాడుకునేందుకు రైతుల పాట్లు

రామారెడ్డి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు(Farmers ) దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో(Impact of El Niño) పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, బోర్లలో నీరు లేకపోవడం, సకాలంలో విద్యుత్ సరఫరా అందకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. చివరకు నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసి పంటలకు నీరందిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ట లింగం మూడు ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశాడు. ప్రస్తుతం పంట పుట్టదశలో ఉండగా,వర్షాలు, బోర్లలో నీరు లేకపోవడం, సమయానికి కరెంటు రాకపోవడంతో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆందోళన చెందిన లింగం ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పొలానికి పారిస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్ ట్రిప్పునకు రూ.1,000 చొప్పున చెల్లిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులకు ఈ అదనపు ఖర్చులు మరింత భారంగా మారాయి. పంట చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో నీటి కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. పెట్టుబడులు పెరుగుతున్నా, లాభాలపై భరోసా లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఆకాశం వైపు ఆశగా చూపులు

ఓవైపు ఎండలు.. మరోవైపు నీటి కొరత.. ఇంకోవైపు విద్యుత్ సమస్యలు.. వెరసి అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పారిస్తున్న రైతులు వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించి, సాగునీటి ఇబ్బందుల నుంచి తమను గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు