మామిడిగుండాలలో సీలింగ్ భూముల రీ-సర్వే
క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అంకిత్
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న సీలింగ్ భూముల రీ-సర్వే పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్(Collector Ankit IAS) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడిగుండాల రెవెన్యూ(Mamidigundala Revenue) పరిధిలోని భూముల విస్తీర్ణం, సర్వే వివరాలు, సీలింగ్ భూముల గుర్తింపు ప్రక్రియపై తహసీల్దార్, సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు.
మామిడిగుండాల రెవెన్యూ పరిధిలో మొత్తం సుమారు 4,800 ఎకరాల భూమి ఉండగా, సర్వే నంబర్ 130లో 4,200 ఎకరాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇందులో సుమారు 2,800 ఎకరాలు సీలింగ్ భూములుగా ఉన్నట్లు తెలిపారు. రీ-సర్వేకు సంబంధించిన వివరాలను కలెక్టర్ పరిశీలించి, అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు తహసీల్దార్ ఖాసీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాష, జీపీఓ సత్యనారాయణ, ప్రకాష్, సర్వేయర్ రమేష్, మామిడిగుండాల సర్పంచ్ ఎట్టి రమణ వీరభద్రం, ఉపసర్పంచ్ దారావత్ రవి, సీలింగ్ భూముల పట్టాల సాధన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.