రూ.63.07 లక్షల చెక్కుల పంపిణీ

16-10-2026 | 04:39pm
  1. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి
  2. ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత.. రైతులు సహకరించాలి
  3. ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి, అక్టోబర్ 16(విజయ క్రాంతి): అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను(Kalyana Lakshmi and Shaadi Mubarak schemes) క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని ఆర్.కె. గార్డెన్స్‌లో పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు రూ.63,07,308 విలువైన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు,

నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడే పరిస్థితులను రైతులు దృష్టిలో ఉంచుకోవాలని విజయరమణ రావు సూచించారు. వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయా పంటలను ప్రభుత్వపరంగా కొనుగోలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

ఈ సీజన్‌లో రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేందుకు జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి నీటి విడుదలకు చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. రైతులు పరిస్థితులను అర్థం చేసుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావాలని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, తహసీల్దార్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు