తైక్వాండో పోటీల్లో గ్రీన్ గ్రోవ్ విద్యార్థుల ప్రతిభ

06-10-2026 | 08:42pm

చిట్యాల, అక్టోబర్ 06(విజయ క్రాంతి ): నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్(Taekwondo Association) ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ యునైటెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్ క్యూరుగీ అండ్ పూమ్సే ఛాంపియన్‌షిప్ పోటీల్లో మంగళవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించారు.

అండర్-14 బాలుర విభాగంలో ఏడో తరగతి విద్యార్థి రాధారపు ప్రణయ్ మణిదీప్ గోల్డ్ మెడల్ సాధించగా, బొక్క శ్రీ విష్ణువర్ధన్, ఇల్లందుల విఘ్నేష్ సిల్వర్ మెడల్స్, బొక్క శ్రీ హర్షవర్ధన్ రెడ్డి బ్రాంజ్ మెడల్ సాధించారు. బాలికల విభాగంలో నాలం లోచన అనన్య, జిట్ట మిథిలా సిల్వర్ మెడల్స్, బత్తుల వేదాన్ షిత బ్రాంజ్ మెడల్ సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థులను చిట్యాల ఎస్సై వెంకట్‌రెడ్డి, పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి అభినందించి పతకాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్సై వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలను చిన్నతనం నుంచే నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై జాన్‌రెడ్డి, తైక్వాండో మాస్టర్ పట్టేడ సుధాకర్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు