ఓజోన్‌కు ముప్పు తెస్తే.. మానవాళి మనుగడకే ప్రమాదం...
- కాలుష్య నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత
- పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలి
- మునుగోడు తహసీల్దార్ నేలపట్ల నరేష్
మునుగోడు, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఓజోన్‌కు ముప్పు తెస్తే మానవాళి మనుగడకే ప్రమాదం ఓజోన్ పొర(ozone layer)ను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మునుగోడు తహసీల్దార్ నేలపట్ల నరేష్(Munugode Tahsildar Nelapatla Naresh) అన్నారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 16న
అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్‌లో ఇండియన్ ఎన్విరాన్‌మెంట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఓజోన్ పరిరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై జీవరాశులను ఓజోన్ పొర రక్షిస్తుందని తెలిపారు. ఓజోన్ పొరను దెబ్బతీసే కాలుష్య కారకాలను నియంత్రించడంతో పాటు పర్యావరణహిత జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి సమస్యలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం వంటి చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.“ఓజోన్ పొరను కాపాడుకుందాం.. భూమిని రక్షించుకుందాం.. భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందిద్దాం” అని సదస్సులో సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణ ఉద్యమ నాయకులు, ఇండియన్ ఎన్విరాన్‌మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, మండల విద్యాశాఖ అధికారి టి. మల్లేశం, ఫారెస్ట్ రేంజ్ అధికారి కె. సుచరిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్ బాల ప్రసాద్, ఫోరం ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట నరసింహాచారి, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు కోణం రమేష్, మండల అధ్యక్షులు బొల్లం శ్రీశైలం, విద్యుత్ ఉద్యోగ సంఘం నాయకులు జె. రమేష్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు జి. వెంకటాచారి, తీరం దాస్ సత్తయ్య, రావుల శీను, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు.