జిలెటిన్ స్టిక్స్ పేలి ఏడుగురి మృతి

25-10-2026 | 05:20am
  1. రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
  2. పలువురికి తీవ్ర గాయాలు
  3. అల్లూరి జిల్లా అనంతగిరి పినకోట వద్ద ఘటన
  4. దర్యాప్తునకు ఆదేశించిన డిప్యూటీ సీఎం, హోంమంత్రి

అమరావతి, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. రోడ్డు నిర్మాణం(Road construction) కోసం చేసిన బ్లాస్టింగ్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రోడ్డు పనులలో బ్లాస్టింగ్ కోసం జిలెటిన్ స్టిక్స్‌ను(Gelatin sticks) లారీలో తెప్పించారు. వాహనంలో డీజిల్ నింపుతుండగా మంటలు చెలరేగాయి.

దీంతో పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్ పేలాయి. పేలుడు ధాటికి రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్, నసీరుద్దీన్, టింకు, మణి, నారాయణరావు, పవన్ కుమార్, అటుగా వెళుతున్న టీచర్ సునీత మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా చిధ్రమయ్యాయి. విషయం తెలుసుకున్న పోటీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటనపై కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేపట్టడమే ప్రాణనష్టానికి కారణమని ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. పేలుడుతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న, దగ్గరలోని ఇళ్లలో ఉన్నవారంతా పరుగులు తీశారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు సంఘటనా స్థలంలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్‌తో ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

డిప్యూటీ సీఎం, హోంమంత్రి విచారం..

ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి అనితలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


మరిన్ని వార్తలు