బిస్లరీ నీళ్లు తాగితే క్యాన్సర్?
- నీటి నమూనాల్లో ప్రమాణాలకు మించి రసాయనాలు
- కంపెనీపై ప్రాసిక్యూషన్‌కు ఫుడ్ సేఫ్టీ శాఖ అనుమతి
- కుకీ చాక్లెట్లను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించాలని ఆదేశం
న్యూఢిల్లీ, నవంబర్ 22: బోర్లు, నల్లాల్లో లభించే నీరు కలుషితమంటూ మార్కెట్‌లో దొరికే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్(Packaged Drinking Water) తాగుతున్నారా? బిస్లరీ నీళ్లు తాగితే మరింత ఆరోగ్యకరమని ఏరికోరి కొనుక్కుంటున్నారా? మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆహార భద్రతా నిపుణులు. దేశంలో పేరొందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీకి చెందిన నీటి నమూనాల్లో నిర్ధేశిత ప్రమాణాలకు మించి బ్రోమేట్ ఉందని ఆహార భద్రతా అధికారుల పరిశీలనలో గుర్తించారు. బ్రోమేట్ అనేది నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో ఏర్పడే రసాయన సమ్మేళనం.
ఇది ఎక్కువైతే క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఆ కంపెనీ అప్పీల్ చేయడంతో రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాలీ న్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్‌ఎస్) ఉన్నాయని తేలింది. ఇది కూడా క్యాన్సర్‌ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. రెండు పరీక్షల్లోనూ నీటి నమూనా సురక్షితం కాదని తేలడంతో బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం అనుమతి ఇచ్చింది.
ఈ పరిణామం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యత, వినియోగదారుల ఆరోగ్య భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది. వసంత్ మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిమాంస ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ సంస్థలపై కూడా ప్రాసిక్యూషన్‌కు ఫుడ్ సేఫ్టీ విభాగం అనుమతి ఇచ్చింది. కుకీ చాక్లెట్లలోనూ అనుమతిలేని రంగులను ఉపయోగించారంటూ వాటిని మార్కెట్ నుంచి తక్షణమే వెనక్కి రప్పించాలని కంపెనీని ఆదేశించింది.