ఎల్ నినో టెర్రర్!

25-10-2026 | 05:25am
  1. చరిత్రలో మొదటిసారి 30 చేరిన డిగ్రీలకు పసిఫిక్ మహా సముద్ర ఉష్ణోగ్రతలు 
  2. మరింత పెరిగే ప్రమాదం.. ముంచుకొస్తున్న కరువు
  3. భారత్‌పై తీవ్ర ప్రభావం.. డిసెంబర్ నాటికి పీక్స్‌కు!
  4. ఇప్పటికే దేశంలో 13 శాతం లోటు వర్షపాతం
  5. వచ్చే ఏడాది ఆరంభంలోనూ ఎల్ నినో తిప్పలు 
  6. అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: గత మూడు నాలుగు నెలలుగా ఏ నోట విన్నా.. ఒకటే మాట.. ‘ఎల్ నినో’!(El Nino) కమ్ముకొస్తున్న కరువును ఇది కండ్ల ముందు చూపిస్తున్నది. ఇప్పటికే వర్షాలు లేక చాలా దేశాలు ఆగమవుతున్నాయి. భారత్‌లోనూ అదే పరిస్థితి. చరిత్రలో మొదటిసారిగా పసిఫిక్ మహాసముద్రంలో(Pacific Ocean) ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా నమోదయ్యాయి. పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు ఈస్థాయిలో రికార్డవడం ఎల్ నినో మరింత బలపడనుందన్న సంకేతాలను స్పష్టం చేస్తున్నది. ఈ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

డిసెంబర్‌లో మరింత ముప్పు

ఎల్ నినో తీవ్రతను అమెరికాలోని నేషనల్ ఓషియన్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. భూమధ్య రేఖకు సమీపంలోని మధ్య పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అక్టోబర్ 22న 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఎన్‌వోఏఏ గుర్తించింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో నమోదవడం చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొంది.

ఎల్ నినో మరింత ముదురుతున్నదని, ప్రపంచమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వార్నింగ్ ఇచ్చింది. డబ్ల్యూఎంవో అంచనా ప్రకారం.. అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో మధ్య, తూర్పు ఉష్ణ మండల పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల టెంపరేచర్లు రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉంది. డిసెంబర్‌లో ఎల్ నినో ప్రభావం గరిష్ఠ స్థాయిలో ఉంటుందని డబ్ల్యూఎంవో తెలిపింది. 

భారత్‌పై తీవ్ర ప్రభావం

ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో చాలా దేశాల్లో వర్షాలు లేవు. పెద్దగా ఎండలను చూడని దేశాలు కూడా ఇప్పుడు ఎండల తాపానికి అల్లాడిపోతున్నాయి. భారత్‌లో మూడు నెలల నుంచి ఎల్ నినో ప్రభావం కనిపిస్తున్నది. వర్షాకాలం ముగింపు దశకు చేరినా తెలంగాణలో ఒక్క పెద్ద  వాన కూడా పడింది లేదు. ఎండాకాలాన్ని తలపిస్తున్నది. ముందున్నది గడ్డుకాలమని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

తాగునీళ్లు కూడా దొరకని పరిస్థితి రావొచ్చని, ఎండలు తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈసారి దేశంలో నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే 13 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. డబ్ల్యూఎంవో అంచనా ప్రకారం.. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో రాబోయే కొన్ని నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. డిసెంబర్‌లో భారత్‌పై ఎల్ నినో ప్రభావం పీక్స్‌లో ఉండొచ్చని డబ్ల్యూఎంవో పేర్కొంది.

పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడం వాతావరణంలోని ప్రతికూల మార్పులకు, కరువు ఛాయలను సూచిస్తుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య మహాసముద్ర జలాలు మరింత వేడెక్కే అవకాశం ఉండటంతో ఆ సమయంలో భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ఎల్ నినో వల్ల కరువు కమ్ముకుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభం వరకు కూడా ఇండియాపై ఈ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  

వేడెక్కుతున్న సముద్రం

గత ఐదు నెలలుగా పసిఫిక్ మహాసముద్రంలోని నీళ్లు అసాధారణంగా వేడెక్కుతున్నాయి. సముద్రంలో ఎల్ నినోను పర్యవేక్షించేందుకు కీలకంగా భావించే ‘నినో 3.4’ ప్రాంతంలో (ఇక్కడి నీటి ఉష్ణోగ్రతలను బట్టి ఎల్ నినో ఎంత బలంగా ఉందో అంచనా వేస్తారు) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత జూన్‌లో సాధారణం కంటే 1.6 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఆగస్టులో 2.5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయింది.

సాధారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు 26 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంటాయి. కానీ జూన్‌లో 1.6 డిగ్రీలు అధికంగా.. ఆగస్టు నాటికి అంటే రెండు నెలల్లో 0.9 డిగ్రీలు ఎక్కువగా పెరిగింది. ఈ నెల 22న ఒక్కరోజు ఏకంగా అక్కడ ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా నమోదైంది.

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ‘నినో 3.4’ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.7 డిగ్రీల వరకు పెరగొచ్చని ఎన్‌వోఏఏ, డబ్ల్యూఎంవో అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే.. 2015 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య (రెండు నెలల కాలంలో) నమోదైన 2.6 డిగ్రీల పెరుగుదలను అధిగమిస్తుంది. ఇది ఎల్ నినో తీవ్రతను స్పష్టం చేస్తుంది.  


మరిన్ని వార్తలు