ఫ్లోరిడాలో కాల్పులు
- ముగ్గురు మైనర్ల పరిస్థితి విషమం
- 12 మందికి గాయాలు
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
- ఫుట్బాల్ మ్యాచ్ కారణమంటున్న స్థానికులు
ఫ్లోరిడా, అక్టోబర్ 25: అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం(University of Florida) సమీపంలో భారీ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మందికి బుల్లెట్ గాయాలు కాగా, అందులో ఆరుగురు మైనర్లున్నారు. ఫ్లోరిడాలోని టల్లాహాసీ ప్రాంతంలో ఒక ఫుట్బాల్ స్టేడియం సమీపంలో ఈ కాల్పుల ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నట్లు టల్లాహాసీ పోలీస్ చీఫ్ రూవెల్ తెలిపారు.
సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతాన్ని దిగ్బంధించామని చెప్పారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. వారిలో ముగ్గురు మైనర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాల్పుల ఘటనపై విచారణ కొనసాగిస్తున్నామని ఇంకా ఘటనకు కారణమైన వివరాలు తెలియరాలేదని, ఎవ్వరినీ అరెస్టు చేయలేదని వివరించారు. కాగా స్థానికుల వివరాల ప్రకారం..
స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరగగా ఇరు జట్లలో వివాదమే కాల్పులకు కారణమై ఉండొచ్చని తెలుస్తుంది. కాల్పుల అనంతరం ఫ్లోరిడా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూనివర్సిటీ (ఎఫ్ఏఎంయూ) కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో తమ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరూ లేరని, క్యాంపస్ నుంచి విద్యార్థులు బయటికి వెళ్లవద్దని హెచ్చరించింది.