భారత్ నేపాల్ ఈపీజీ నివేదికకు ప్రాధాన్యత లేదా
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ మధ్య దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కీలక దౌత్య అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2018లో సిద్ధమైన ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్ (EPG) నివేదికకు ఇక ప్రాధాన్యత లేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి స్పష్టం చేశారు. పాత నివేదికలపై కాకుండా భవిష్యత్తు సంబంధాల (Bilateral Relations) బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
2016లో భారత్, నేపాల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్.. 1950 నాటి శాంతి, స్నేహ ఒప్పందంతో పాటు సరిహద్దు, వాణిజ్య, భద్రతా అంశాలను సమీక్షించింది. ఈ నివేదిక 2018లో సిద్ధమైనప్పటికీ ఇరు ప్రభుత్వాలకు అధికారికంగా అందలేదు. దీంతో అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్లోనే ఉంది.
మరోవైపు కాలాపాని, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలకు సంబంధించి సరిహద్దు వివాదం (Border Dispute) కొనసాగుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక యంత్రాంగాలను (Bilateral Mechanisms) మళ్లీ క్రియాశీలం చేస్తామని మిస్రి తెలిపారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సమావేశంలో కీలక ఉమ్మడి దార్శనిక పత్రానికి ఆమోదం తెలిపారు. ఇందులో 1950 నాటి ఒప్పందాన్ని పరస్పర అంగీకారంతో సమీక్షించే అంశాన్ని చేర్చారు. దీంతో పాత EPG నివేదికకు బదులుగా కొత్త దౌత్య మార్గంలో (Diplomatic Approach) ఇరు దేశాల సంబంధాలు ముందుకు సాగనున్నాయి. అయితే సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.