భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు

24-11-2026 | 04:46pm

కలెక్టర్ కుమార్ దీపక్

దండేపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో (Satyanarayana Swamy Temple) కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు.

మంగళవారం గూడెంగుట్టలోని శ్రీ సత్యనారాయణ స్వామిని సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లు చేయగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యూలైన్ల నిర్వహణ, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రతి సంవత్సరం సుమారు లక్ష మందికి పైగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శాంతి, సామరస్యం, సుఖసంతోషాలు, సర్వతోముఖాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు