మద్దిమడుగుకు సీఎం రాక.. పకడ్బందీ ఏర్పాట్లు
- 26న సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన
- ఆంజనేయస్వామి దర్శనం.. 5 వేల మంది గిరిజనులతో ముఖాముఖి
అచ్చంపేట, నవంబర్ 24 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈ నెల 26న మద్దిమడుగు పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(District Collector Hemant Keshav Patil) అధికారులను ఆదేశించారు.
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన, మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి దర్శనం, సుమారు 5 వేల మంది గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి ఆలయ దర్శన క్రమం, పూర్ణకుంభ స్వాగతం, వినాయకుడి దర్శనం, ఆలయ ప్రదక్షిణ, ఆంజనేయస్వామి, శివలింగ దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, రాకపోకల మార్గాలు, వీఐపీల ప్రవేశం, నిష్క్రమణపై అధికారులకు సూచనలు చేశారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని అర్చకులకు తెలిపారు.
హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణం, సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించి తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరుకానున్నందున ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్.. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖ భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్స్‌లు, అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ శాఖ నిరంతర సరఫరాకు చర్యలు చేపట్టాలని సూచించారు.
పారిశుద్ధ్యం, తాగునీరు, ప్రజల సౌకర్యాలపై సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని మద్దిమడుగు పర్యటన నేపథ్యంలో భద్రతా పరమైన అంశాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 5 వేల మందికి పైగా గిరిజనులు హాజరుకానున్నారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి భద్రతా విభాగం డీఎస్పీ జనార్దన్, అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.