జామియాలో తీవ్ర ఉద్రిక్తత
- జేఎంఐఎస్యూ ఎన్నికల కోసం ఆందోళన
- విద్యార్థులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ
- డీజేఎంఐయూలో ఆన్లైన్ తరగతులకు ఆదేశం
- సమ్మెను అణచివేసే యత్నమని ఎస్ఎఫ్ఐ ఆరోపణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో(Jamia Millia Islamia University) గత 12 రోజుల నుంచి చేస్తున్న విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న విద్యార్థులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అన్ని కోర్సుల తరగతులను ఆన్లైన్లో నిర్వహించ నున్నట్లు యూనివర్సిటీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 12 నుంచి విద్యార్థులు జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్ (జేఎంఐఎస్యూ) ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. వైస్-ఛాన్సలర్ మజార్ ఆసిఫ్, రిజిస్ట్రార్ మహ్మద్ మహతాబ్ ఆలం రిజ్వీలతో పాటు 1,500 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది శనివారం ఉదయం అన్సారీ ఆడిటోరియం ప్రాంగణంలో గుమిగూడి, ఆందోళనను విరమించుకోవాలని నిరసనకారులను కోరేందుకు గేట్ నెం.7 వైపు తరలివచ్చారు.
విశ్వవిద్యాలయం ప్రకారం, ఆందోళనను విరమించుకోవాలని సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు నిరసనకారులను ఒప్పించారు, కానీ విద్యార్థులు నినాదాలు చ్తేనే ఉండి, అధ్యాపకులను తిరిగి వెళ్లమని కోరారు. అయితే కొంతమంది నిరసనకారులు భద్రతా సిబ్బందిని, సిబ్బందిని, ఉపాధ్యాయులను తోసేశారని, ఆ తర్వాత సిబ్బంది ఆ ప్రదేశం నుంచి వైదొలిగారని పరిపాలన విభాగం ఆరోపించింది.
అయితే, ఘర్షణ సమయంలో ప్రొక్టర్, రిజిస్ట్రార్‌తో పాటు భద్రతా సలహాదారు సహా విశ్వవిద్యాలయ అధికారులు నిరాహార దీక్ష చేస్తున్న వారిని బలవంతంగా తొలగించడానికి ప్రయత్నించారని, టెంట్లు తొలగించి మహిళా విద్యార్థులను ఈడ్చుకెళ్లారని జేఎంఐఎస్యూ (ఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. విద్యార్థులపై బలప్రయోగం చేసినందుకు చీఫ్ ప్రొక్టర్, భద్రతా సలహాదారు రాజీనామా చేయాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయం వెలుపల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారని, విద్యార్థులను క్యాంపస్‌లోకి రాకుండా అడ్డుకున్నారని, కొందరిని ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్నారని కూడా ఆరోపించారు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ పోలీసుల నుంచి ఎటువంటి తక్షణ స్పందన రాలేదు. నిరసనకారులు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించడంతో ఘర్షణ తలెత్తింది.
విద్యార్థుల భద్రత దృష్ట్యా తరగతులను ఆన్‌లైన్‌కు మార్చినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహ్మద్ మహతాబ్ ఆలం రిజ్వీ తెలిపారు. అన్ని కోర్సుల విద్యార్థులు తమ ఆన్లైన్ తరగతుల షెడ్యూల్‌లకు కట్టుబడి ఉండాలని, క్యాంపస్‌కు రాకుండా ఉండాలని కోరుతూ, తదుపరి నోటీసు వచ్చేవరకు గేట్లు, గ్రంథాలయాలు మూసి ఉంటాయని విశ్వవిద్యాలయం పేర్కొంది.
మరోవైపు, నిరసన ప్రాంగణంలో షర్జీల్ ఇమామ్ విడుదల, కశ్మీర్‌కు స్వేచ్ఛ వంటి నినాదాలతో పోస్టర్లు కనిపించడం వివాదానికి దారితీసింది. నిరసనకారు లకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌ను పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పద నినాదాలపై ప్రతిపక్ష నేతలు స్పందించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.