మోదీ తండ్రి కూడా పోతారు
- ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
- పదవి నుంచి మోదీ దిగిపోరన్న యువకుడి కామెంట్లపై గరం
- ‘మోదీకా బాప్ బీ జాయేగా! ఛల్..’ అంటూ ఆగ్రహావేశాలు
పాట్నా, అక్టోబర్ 25: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఓ యువకుడు చేసిన కామెంట్లకు కోపంతో ఊగిపోయారు. ‘మోదీనే కాదు.. మోదీ తండ్రి కూడా పోతారు’ అంటూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ తొలి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత శ్రీకృష్ణసింగ్ 139వ జయంతి వేడుకలు ఆదివారం పాట్నాలో జరిగాయి.
ఇందులో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నల్లధనం వెనక్కి తెప్పిస్తానన్నారని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారని.. అవన్నీ ఎటుపోయాయని నిలదీశారు. ‘సర్’ పేరిట ఓట్లను తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి శిక్ష తప్పదని, పదవిలో నుంచి దిగిపోయే సమయం వచ్చిందని ఆయన హెచ్చరించారు.
అక్కడే సభలో ఉన్న సంతోష్‌కుమార్ అనే ఓ యువకుడు.. ‘పదవి నుంచి మోదీ దిగిపోరు’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఖర్గే.. ‘ఆ.. ఛలో ఛలో! మోదీకా బాప్ బీ జాయేగా! బాప్ బీ జాయేగా! మోదీకా బాప్ బీ జాయేగా.. ఛల్ (మోదీ తండ్రి కూడా పోతారు)’ అంటూ వ్యాఖ్యానించారు. ఖర్గే మాట్లాడుతుండగానే సంతోష్‌ను అక్కడి వ్యక్తులు పట్టుకొని బయటకు పంపించారు.
అనంతరం సంతోష్ మీడియాతో మాట్లాడుతూ.. తాను అన్నది ఖర్గే పూర్తిగా వినలేదని, తిరుగుబాటు చేస్తే తప్ప మోదీ దిగిపోరని తాను చెప్పబోతుంటే పూర్తిగా అర్థం చేసుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపాడు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తనని చెప్పాడు. కాగా.. సభలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపైనా ఖర్గే విమర్శలు గుప్పించారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఆరంభం నుంచే మతపర కార్యకలాపాలకు పాల్పడుతున్నదని.. దాని సిద్ధాంతాలు కొనసాగినన్నిరోజులు దేశంలో శాంతి నెలకొనదని అన్నారు. అంటరానితనాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సమర్థిస్తున్నాయని ఆరోపించారు.
తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఖర్గే: అమిత్ షా
ఖర్గే తాజా కామెంట్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఖర్గే జీ తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. కాంగ్రెస్ వరుస ఓటములతో ఆ పార్టీ నేతలకు ఏ పనీలేకుండాపోయింది. అందుకే తిట్టడం ఒకటే పనిగా పెట్టుకున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులను కూడా వదలడం లేదు. మొన్నటివరకు ప్రధాని మోదీ తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా దూషిస్తున్నారు.
ఆ నాయకులను ప్రజలు ఎప్పటికీ క్షమించరు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌కు దూరమవుతున్నారు’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ఖర్గే కామెంట్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ఖండించారు. కుటుంబ సభ్యులను, చనిపోయిన వ్యక్తులను కూడా రాజకీయాల్లోకి లాగడం కాంగ్రెస్‌లోని సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు.