పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో 20 మంది మృతి
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారాన్ని తగ్గించాలంటూ రోడ్డెక్కిన ప్రజలపై పాక్ భద్రతా దళాలు చర్యలకు దిగాయి. రావలకోట్, పరిసర ప్రాంతాల్లో నిరసనకారులపై కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనల్లో సుమారు 20 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
పెరుగుతున్న జీవన వ్యయం, విద్యుత్ టారిఫ్‌ల (Electricity Tariffs) పెంపు, గోధుమలపై సబ్సిడీల కోత, భారీ పన్నులకు వ్యతిరేకంగా స్థానికులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు, హక్కులు కల్పించాలంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసన శిబిరాలను తొలగించేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
నిరసనకారులపై తుపాకులతోనే కాకుండా డ్రోన్లు (Drones), రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతోనూ దాడులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నివాస ప్రాంతాలపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు స్థానిక నిరసన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో రావలకోట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.
పాక్ భద్రతా బలగాల చర్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపై సైనిక బలగాలను ప్రయోగించడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ ప్రాంతాన్ని మరో గాజాలా మార్చారంటూ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలప్రయోగంతో తమ ఉద్యమాన్ని అణచివేయలేరని హెచ్చరిస్తున్నారు.
పీఓకేలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు తాజాగా రావలకోట్‌లో హింసాత్మకంగా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను భారీగా మోహరించారు. మరోవైపు నిరసనకారులు వెనక్కి తగ్గకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాలపై అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చ మొదలైంది.