జనసేనకు తీరని విషాదం

07-11-2026 | 11:00am

ఎన్నికల్లో పోటీ.. అంతలోనే అనంతలోకాలకు!

తూర్పుగోదావరి, నవంబర్ 7: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన 26 ఏళ్ల గారపాటి దివ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

పోలింగ్ ముగిసిన తర్వాత అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

దేవరపల్లి మండలం ధుమంతునిగూడేనికి చెందిన దివ్య.. స్థానిక ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత ఆమెకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే రాజమండ్రిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం గురువారం రాత్రి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయితే శుక్రవారం ఉదయం దివ్య ఆరోగ్యం మరోసారి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

ఇద్దరు చిన్నారులను వదిలి వెళ్లిపోయిన దివ్య

దివ్య భర్త శ్రీనివాస్‌తో కలిసి జనసేన పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఆకస్మిక మరణం అందరినీ కలచివేసింది. ముఖ్యంగా నాలుగు నెలల పసిబాబు సహా ఇద్దరు కుమారులను వదిలి ఆమె వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను కన్నీరుమున్నీరుగా మార్చింది. ఈరోజు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఈ విషాద వార్త వెలుగులోకి రావడంతో ధుమంతునిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నికల ఫలితాల ఉత్కంఠ మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు