36 విల్లాలు.. కోట్ల వ్యవహారం!

01-11-2026 | 07:24am

ఐఏఎస్–ఐపీఎస్ దంపతులపై ACB నజర్

జైపూర్: రాజస్థాన్‌లో ఇద్దరు సీనియర్ అధికారుల ఆస్తుల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్, ఆయన భార్య ఐపీఎస్ అధికారి ప్రశాఖా మాథూర్‌కు సంబంధించిన విల్లాల కొనుగోలు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణ చేపట్టింది. ఓ ప్రైవేట్ రిసార్ట్ కంపెనీకి అధికారాన్ని ఉపయోగించి ప్రయోజనాలు కల్పించారనే ఆరోపణలతో పాటు, అదే సంస్థ నుంచి మార్కెట్ ధర కంటే తక్కువకు విల్లాలు కొనుగోలు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

36 విల్లాలు.. రూ.5.52 కోట్ల వ్యవహారం!

ACB ప్రాథమిక విచారణలో ఉదయ్‌పూర్‌లోని అనంత రిసార్ట్‌లో 20, అల్వార్‌లోని అజబ్‌గఢ్ రిసార్ట్‌లో మరో 16 విల్లాల కొనుగోలు అంశం వెలుగులోకి వచ్చింది. మొత్తం 36 విల్లాల విలువ సుమారు రూ.5.52 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక్కో విల్లాను రూ.15 లక్షల నుంచి రూ.16.5 లక్షల మధ్య కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆస్తుల్లో కొన్ని అధికారుల భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్టర్ అయినట్లు సమాచారం.

కంపెనీకి ప్రత్యేక రాయితీలు ఇచ్చారా?

గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు రిసార్ట్ నిర్మాణ నిబంధనల్లో సడలింపులు, అవసరమైన Certificates తనిఖీ లేకుండానే అనుమతులు, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వంటి ప్రయోజనాలు కల్పించారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా 2026 మార్చి 27న కంపెనీకి ప్రత్యేక Financial Package మంజూరైన రోజే ఉదయ్‌పూర్‌లో 20 విల్లాల రిజిస్ట్రేషన్ జరగడం ACB పరిశీలనలో కీలక అంశంగా మారింది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలోని Section 17A కింద విచారణకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 29న ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్‌ను, అక్టోబర్ 31న ఆయన భార్య ప్రశాఖా మాథూర్‌ను Awaiting Posting Orders (APO)లో ఉంచింది. ప్రస్తుతం ACB దర్యాప్తు ప్రధానంగా శిఖర్ అగర్వాల్‌పై కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసిన అంశంపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆరోపణలు నిజమా కాదా అనేది సమగ్ర Investigation తర్వాతే తేలనుంది.

మరిన్ని వార్తలు