ప్రకృతి ప్రకోపానికి రైతన్న బలి

01-11-2026 | 05:30am

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్‌లో వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం 

నిన్నటి వరకు కరువు.. నేడు తుఫాన్ తాకిడి

మహబూబాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ప్రకృతి ప్రకోపానికి అన్నదాత అతలాకుతలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రంలో కురిసిన వర్షానికి మార్కెట్‌లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. రెక్కల కష్టం కళ్లెదుటే వరదపాలై కొట్టుకుపోతున్న దృశ్యాన్ని చూసి అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఏడాది వానకాలం ఆరంభం నుంచి రైతులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఆశించిన వర్షాలు సమయానికి కురవక పోవడంతో పంటల సాగు విస్తీర్ణం మహబూబాబాద్ జిల్లాలో ఘన నియంగా తగ్గింది.

వేసిన కొద్దిపాటి పంటలను బావులు, బోర్ల ద్వారా అష్ట కష్టాలు పడి పండించిన రైతన్నకు పంట దిగుబడి చేతికందే దశలో ఇప్పుడు అర్నబ్ తుఫాన్ కంటనీరు పెట్టిస్తోంది. గత మూడు రోజులుగా తుఫాన్ కారణంగా మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోతదశకు వచ్చిన వరి పంట పొలాల్లో నీళ్లు నిలవడం, కొన్నిచోట్ల నేల వాడడం, పత్తి పంట తేమ అధికమై కాయలు నల్లగా మారడం, వికసించిన దూది వర్షానికి పాడైపోవడం జరుగుతోందని, అలాగే కొన్నిచోట్ల కోసిన పంటలను ఆరబెట్టుకోగా వర్షానికి తడిసిపోయి నాణ్యత దెబ్బతిని ఆశించిన ధర లభించే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, గూడూరు మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి 50 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అలాగే శనివారం మధ్యాహ్నం కేసముద్రంలో అదే స్థాయిలో వర్షం కురిసింది. మార్కెట్‌కు విక్రయానికి తెచ్చి ఆరబెట్టుకున్న వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని తడిసిపోగా మరికొన్ని వరద నీటిలో కొంతమేర కొట్టుకుపోయాయి. మక్కజొన్న, ధాన్యం రాశులు వర్షాలకు తడిచిపోవడంతో మళ్లీ వాటిని ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షానికి తడిసిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవచ్చన్న భయాందోళనలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. పండిన కొద్దిపాటి పంటకు ఆశించిన ధర లభిస్తుందనుకుంటే ఇలా ప్రకృతి కన్నెర్రకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందని కన్నీరు పెట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు