అబద్ధాల రేవంత్

01-11-2026 | 05:15am
  1. ‘క్రెడిట్ చోరీ’ చేస్తూ వేల కోట్ల భూదోపిడీ
  2. మాజీ మంత్రి హరీశ్ ఆరోపణలు
  3. జడ్జిమెంట్ కాపీపై ఇంకు ఆరకముందే మియాపూర్ భూముల అమ్మకానికి కుట్ర
  4. మంచిరేవులలో 2,000 కోట్ల భూ స్కామ్
  5. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సవాల్

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ప్రభుత్వ భూముల పరిరక్షణపై సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, అబద్ధానికి అంగీ లాగు తొడిగితే అచ్చం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లెక్కనే ఉంటుందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(BRS leader Harish Rao) విమర్శించారు. “నిస్సిగ్గుగా, నిర్భయంగా, అలవోకగా, అడ్డగోలుగా అబద్ధాలు ఆడటంలో ఒకవేళ ఆస్కార్ అవార్డు ఇస్తే అది పక్కాగా రేవంత్ రెడ్డికే ఇవ్వాలి.

నిజాలు చెప్పకూడదని ఆయనకు ఏమైనా శాపం ఉందో ఏమో తెలియదు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడితే.. నేడు రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ‘క్రెడిట్ చోరీ’ చేస్తూ, ఆ భూములను అమ్ముకునేందుకు, తన బినామీలకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు” అని ఆరోపించారు.

శనివారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.  మియాపూర్ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ ఇంకా చేతికి రాలేదని, జడ్జి సంతకం పెట్టిన పెన్ను ఇంకు కూడా ఆరలేదని, అప్పుడే ఆ భూములను అమ్మకానికి పెట్టాలని కలెక్టర్లను పరుగులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. “వంటంతా మేం వండి పెట్టిన తర్వాత.. ఎవడో వచ్చి చివర్లో ఒక్కసారి గంట తిప్పి ‘మొత్తం నేనే వండినా, నేనే వడ్డించినా’ అన్నట్లుగా ఉంది రేవంత్ వ్యవహారం. ఇది ఓట్ చోరీ కాదు.. క్రెడిట్ చోరీ” అని దుయ్యబట్టారు. 

ఆ భూములను మేమే కాపాడాం..

‘మంచిరేవులలోని రూ. 10 వేల కోట్ల విలువైన 142 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ అమ్ముకునే ప్రయత్నం చేసిందంటూ, తాను కాపాడానంటూ  రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం చెప్పారు. అసలు ఇది 1960 నుంచి సాగుతున్న 50 ఏండ్ల న్యాయపోరాటం. గ్రేహౌండ్స్ పోలీసుల ఆధీనంలో ఉన్న భూమి అది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో 2010 ఫిబ్రవరి 5న హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద ప్రభుత్వం ఈ కేసు ఓడిపోయింది.

నాడు ఉద్దేశపూర్వకంగానే కోర్టుకు అడ్వకేట్ జనరల్  హాజరుకాకుండా, ఒక చిన్న జీపీ/ఏజీపీని పంపి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసి భూమిని ప్రైవేట్ పరం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే’ అని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ సీఎం అయ్యాక నిర్వహించిన రివ్యూలో మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమిని కాపాడుకోవడానికి సీనియర్ అడ్వకేట్లను పెట్టుకోవడానికి అనుమతి కావాలని నాటి గ్రేహౌండ్స్ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కోరారని, కేసీఆర్ ఆదేశాల మేరకు మరుసటి రోజే దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను నియమించుకోవాలని నాటి సీఎస్ రాజీవ్ శర్మ గ్రేహౌండ్స్ హెడ్‌కు ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు.

‘సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, గిరిని నియమించి బలమైన వాదనలు వినిపించాం. ఫలితంగా 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ భూమి ప్రభుత్వానిదేనని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్తే.. అక్కడ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌తోపాటు వైద్యనాథన్, గిరిని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రంగంలోకి దించి బలమైన వాదనలు వినిపించిన ఫలితంగానే.. 2023 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ 142 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానివేనని తుది తీర్పు ఇచ్చింది. కాపాడింది మేమైతే.. చోర్ కోత్వాల్‌ను తిట్టినట్లు రేవంత్ రెడ్డి మాపైనే నిందలు వేస్తున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రూ.వెయ్యి కోట్ల స్కామ్..

గ్రేహౌండ్స్ భూమిలో.. మృగవని పక్కన సౌత్ సైడ్ 30 ఏండ్లుగా ఉన్న గ్రేహౌండ్స్ ప్రహరీ గోడను రేవంత్ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే పడగొట్టి 10.10 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు వదిలేసి, రెండే రోజుల్లో లోపలికి కొత్త కాంపౌండ్ వాల్ కట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. గండిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ భూమిని (సర్వే నంబర్లు 362, 373, 374) ‘కన్వేయన్స్ డీడ్ వితౌట్ కన్సిడరేషన్’ కింద రిజిస్ట్రేషన్ చేశారని, ఆ డాక్యుమెంట్లో మార్కెట్ వాల్యూ రూ. 45,39,43,600 అని స్పష్టంగా రాసి ఉందని.. కానీ కింద కన్సిడరేషన్ వాల్యూ ‘సున్నా’ అని వేసి, ప్రభుత్వానికి కట్టాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో రూపాయి కూడా కట్టకుండా జీరో వాల్యూ రిజిస్ట్రేషన్ చేసేశారని మండిపడ్డారు.

మహమ్మద్ అమీర్ సలావుద్దీన్ తదితర 9 మంది ద్వారా.. ‘డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘డ్రీమ్ వ్యాలీ ప్రాపర్టీస్’ (ప్రతినిధి కే సంతోష్ రెడ్డి) పేరు మీద ఈ 10.10 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసి, ఆ వెంటనే అందులో 300, 400 గజాల ప్లాట్లుగా చేసి ఫటాఫట్ మరో 20 రిజిస్ట్రేషన్లు చేసి వెయ్యి కోట్ల ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టారని ఆరోపించారు. మంచిరేవులలో మొత్తంగా రూ.2వేల కోట్ల స్కామ్ జరిగిందని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.

ఎవరి కోసం అమ్మకం?

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి అమ్మితే ‘బొందలగడ్డకు, బడులకు, దవాఖానాలకు జాగా లేకుండా అమ్ముతారా?’ అని రేవంత్‌రెడ్డి మొసలి కన్నీరు కార్చారని, ఇప్పుడు జడ్జిమెంట్ కాపీ కూడా రాకముందే ‘ఉరుకు కలెక్టర్ ఉరుకు.. ప్లాట్లు కొట్టు, అమ్ముదాం’ అని ఆగమాగం చేస్తున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘ఎవరి దగ్గరైనా అడ్వాన్సులు తీసుకున్నారు? ఎవరికి కట్టబెడుతున్నారు?’ అని నిలదీశారు. భూపాలపల్లి అటవీ భూముల కేసులో మూడేండ్లు తాము వాదనలు వినిపించామని తెలిపారు.

‘కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లిలో 450 ఎకరాలు.. మొత్తంగా 850 ఎకరాల విలువైన భూమిని ఎకరా కేవలం రూ. 50 వేల చొప్పున ‘ఐఎంజీ’ బిల్లీరావుకు కట్టబెట్టిన పాపాత్ములు ఎవరు? రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు రేవంత్ రెడ్డి అదే టీడీపీ ముఠాలో భాగస్వామి కాదా?’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.

‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కేసీఆర్ కాపాడి చెట్లు పెంచితే.. రేవంత్ రెడ్డి రాగానే జేసీబీలు పంపి చెట్లు నరికి, జింకలను, మూగజీవాలను ఆగం పట్టించారని, అక్కడ నేరుగా అమ్మడం కుదరకపోయేసరికి.. యూనివర్సిటీ విద్యార్థులకు, అధికారులకు కనీసం తెలియకుండా దొడ్డిదారిన ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో కుదువపెట్టి అధిక వడ్డీకి రూ. 10,000 కోట్ల అప్పు తెచ్చారు. ఒక బ్రోకర్‌కు ఏకంగా రూ. 400 కోట్ల లంచం ఇచ్చారు. భూమిని కాపాడింది మేమైతే.. బ్రోకర్లకు రూ. 400 కోట్ల లంచాలిచ్చి ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో షోకులు చేస్తున్నది రేవంత్ రెడ్డి’ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరు పూటకో చిత్తం, గడికో విధానం, అన్ని యూటర్నులు అన్నట్టుగా ఒక ‘అపరిచితుడు’ సినిమా లాగా తయారైందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు