జ్ఞానేశ్.. రాజద్రోహి!
- ఆయనపై కేసు పెట్టి విచారించాలి.. మాక్ పార్లమెంట్ వేదికగా ఇండీ కూటమి డిమాండ్
- సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన ఖర్గే
- ‘సర్’ను నిలిపివేయాలి.. 13.2 కోట్ల మంది ఓటర్లను తిరిగి చేర్చాలి
- అన్ని ఎన్నికలను పేపర్ బ్యాలెట్‌తోనే నిర్వహించాలి
- ఎన్నికల కమిషనర్లకు రక్షణగా ఉన్న 2023 చట్టాన్ని రద్దు చేయాలి
- 2014 నుంచే బీజేపీ ‘అధికార’ కుట్రలు చేస్తున్నదని ఏఐసీసీ చీఫ్ ఆరోపణ
- 2024 ఎన్నికల్లోనూ అక్రమంగా గెలిచారు: రాహుల్‌గాంధీ
- పాల్గొన్న సోనియా, ప్రియాంక, చిదంబరం, కూటమి నేతలు
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశంలో ఓట్ల చోరీకి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్(CEC Gyanesh Kumar) కుట్ర చేశారని, ఆయన రాజద్రోహి అని, రాజద్రోహం కేసు పెట్టి విచారించాలని ఇండీ కూటమి డిమాండ్ చేసింది. జ్ఞానేశ్‌ను తొలగించాలని ఏడు నెలల క్రితం పార్లమెంట్లో నోటీసులు ఇస్తే పట్టించుకోలేదని మండిపడింది. ‘సర్’ను వెంటనే నిలిపివేయా లని, అన్ని ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే చేపట్టాలంది.
బహిరంగ ప్రజా అభిశంసన పేరిట ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(AICC Chief Mallikarjun Kharge) నివాసంలో శనివారం సాయంత్రం ఇండీ కూటమి మాక్ పార్లమెంట్ నిర్వహించింది. దీనికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, చిదంబరంతోపాటు ఎస్పీ, టీఎంసీ సహా కూటమి పార్టీల ముఖ్యమంత్రులు, నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ఖర్గే ప్రవేశపెట్టారు.
జ్ఞానేశ్‌పై ఆరు ప్రధాన ఆరోపణలు
అభిశంసన తీర్మానంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరు ప్రధాన ఆరోపణలు చేశారు.
1. ఎన్నికల చోరీకి కుట్ర: దేశంలో అన్ని ఎన్నికల్లో అక్రమాలకు సీఈసీ జ్ఞానేశ్ సహకరిస్తున్నారు.
2. 13.2 కోట్ల ఓటర్లు తొలగింపు: సర్ పేరిట ఓటర్ల జాబితా నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13.2 కోట్ల మంది పేర్లను తొలగించారు.
3. ఫామ్ మార్పు: పార్లమెంట్ అనుమతి తప్పనిసరి అయిన ఫామ్హా ఆ అనుమతి లేకుండానే మార్పులు చేశారు.
4. ఈసీ నెట్ దుర్వినియోగం: ఈసీ నెట్ వేదికగా ఓటర్ల జాబితాను తన గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారు.
5. ఇద్దరు కమిషనర్ల మాట వినలే: ఈసీలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను సీఈసీ జ్ఞానేశ్ పట్టించుకోవడం లేదు. వాళ్లను భాగస్వాములు చేయడం లేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
6. మోదీ, అమిత్ షా చెప్పినట్లు చేస్తూ..: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏది చెప్తే అది సీఈసీ జ్ఞానేశ్ చేస్తున్నారు. వారి సూచనలతోనే ఓట్ల చోరీకి కుట్ర పన్నారు.
ఆ చట్టం వల్లే జ్ఞానేశ్ ఆటలు: ఖర్గే
సీఈసీతోపాటు మిగతా ఎన్నికల కమిషనర్ల నియామకం, పదవీకాలానికి సంబంధించి 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని జ్ఞానేశ్‌కుమార్ దుర్వినియోగం చేస్తున్నారని, దాన్ని అడ్డుపెట్టుకొని ఓట్ల చోరీకి, ఎన్నికల చోరీకి కుట్ర చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఆ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన 145 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఆమోదించుకున్నారని మండిపడ్డారు.
ఈ చట్టం ఎన్నికల కమిషనర్లకు జీవితకాలం రక్షణ కల్పిస్తున్నదని.. రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేని స్థాయిలో వారికి రక్షణ దక్కుతున్నదని తెలిపారు. ఈ చట్టమే సీఈసీ ఆయుధంగా వాడుకొని బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సీఈసీకి రక్షణ కల్పిస్తున్న ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఇండీ కూటమి డిమాండ్లలో ఒకటని తేల్చిచెప్పారు. అదేవిధంగా ‘సర్’ పేరిట 13.2కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, వారందరి పేర్లను పునరుద్ధరించడంతోపాటు సర్‌ను పూర్తిగా ఆపేయాలని.. అన్ని ఎన్నికలను పేపర్ బ్యాలెట్‌తోనే నిర్వహించాలని కూటమి తరఫున డిమాండ్లను మాక్ పార్లమెంట్ ముందు ఖర్గే ఉంచారు.
2014 నుంచి బీజేపీ కుట్రలు..
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కుట్రలు పన్నుతున్నదని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఏడు నెలల క్రితం సీఈసీ జ్ఞానేశ్‌పై చర్యల కోసం పార్లమెంట్ ఉభయ సభల్లో 193 మంది ప్రతిపక్షాలు నోటీసులు ఇస్తే పట్టించుకోలేదని, అందుకే తాము పార్లమెంట్ బయట ప్రజా అభిశంసన చేపట్టామని ఆయన తెలిపారు. సీఈసీకి తాము వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదని.. ఓట్ల చోరీకి పాల్పడుతున్నందునే ఆయనను పదవి నుంచి తప్పించి, రాజద్రోహం కేసు పెట్టి, విచారించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రతిపక్ష పార్టీల ఓటర్లను, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ‘సర్’ను తీసుకువచ్చారని ఆయన దుయ్యబట్టారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించలేదని.. కానీ, మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే మహిళలు, దళితులు, అణగారిన వర్గాలు, పేదలు అనే తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు (సార్వత్రిక ఓటు హక్కు) కల్పించుకున్నామని ఖర్గే గుర్తుచేశారు. అలా కల్పించడాన్ని అప్పట్లో ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందని.. ఇప్పుడు ఆ ఓటు హక్కుపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు.
2024లోనూ అక్రమ గెలుపే: రాహుల్
సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్ కొనసాగడానికి ఏమాత్రం వీల్లేదని, ఆయనను తప్పించాల్సిందేనని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మాక్ పార్లమెంట్లో ఆయన ముగింపు స్పీచ్ ఇచ్చారు. ‘జ్ఞానేశ్ తప్పించుకోలేరు. ఆయనను పదవిలో కొనసాగనివ్వబోం. ఓట్ల చోరీకి సంబంధించి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అయినా.. ఇంకా జ్ఞానేశ్‌ను కొనసాగించాలని బీజేపీ పట్టుబడితే, జనమే తగిన గుణపాఠం చెప్తారు’ అని రాహుల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్ ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల అవకతవకలకు జ్ఞానేశ్‌ను సాధనంగా మోదీ, అమిత్ షా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. జ్ఞానేశ్‌పై రాజద్రోహం కేసు పెట్టి విచారించాల్సిందేనన్నారు. అన్ని వ్యవస్థలను మోదీ సర్కార్ తమ గుప్పిట్లో పెట్టుకొని.. దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం రామ్‌లీలా మైదాన్‌లో చేపట్టబోయే ర్యాలీతో తమ సత్తా ఏమిటో చూపిస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మందికిపైగా ఓటర్లను తొలగించారని.. ఇది మొత్తం ఓటర్లలో దాదాపు 15శాతమని తెలిపారు.
2024 ఎన్నికల్లోనూ అక్రమంగానే మోదీ గెలిచారని, ఇందుకు ఓట్ల చోరీనే కారణమని ఆయన ఆరోపించారు. కాగా, మాక్ పార్లమెంట్లో ఎస్పీ, టీఎంసీ నేతలతోపాటు పీడీపీ నాయకురాలు, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ తదితరులు మాట్లాడారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై ఖర్గే ఇచ్చిన అభిశంసన తీర్మానానికి మాక్ పార్లమెంట్లో మద్దతు తెలపగా ఆమోదం పొందినట్లు మాజీ స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు.