మల్లన్న సాగర్‌కు లీకేజీ లేదు!

01-11-2026 | 05:30am
  1. డ్యామ్‌కు ఎలాంటి ముప్పు లేదు
  2. పంప్ హౌస్ నిర్మాణ పనుల్లో పేలుళ్లు నిలిపివేశాం
  3. బండరాళ్లను కెమికల్ పద్ధతిలోనే తొలగిస్తున్నాం
  4. హెచ్‌ఎండబ్ల్యూఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మహేష్‌కుమార్

గజ్వేల్, అక్టోబర్ 31: మల్లన్న సాగర్ డ్యామ్‌(Mallanna Sagar Dam)కు ఎలాంటి ముప్పు లేదని, తి ప్పారం శివారులో చేపడుతున్న పంపుహౌస్ నిర్మాణ పనుల వల్ల డ్యామ్ కట్టకు ఎలాంటి లీకేజీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. నిర్మాణ పను ల్లో భాగంగా చేపట్టిన పేలుళ్లను నిలిపివేశామని, ప్రస్తుతం భారీ బండరాళ్లను కెమికల్ పౌడర్‌ను వినియోగించి తొలగిస్తున్నామని హెచ్‌ఎండబ్ల్యూఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామ శివారులోని పంప్ హౌస్ నిర్మాణ ప్రాంతాన్ని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శివధర్మ తేజతో కలిసి పరిశీలించారు.

మల్లన్నసాగర్ డ్యామ్‌కు సుమారు 293 మీటర్ల దూరంలో ప్రభుత్వ అనుమతులతోనే నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. నిర్మాణ ప్రాంతంలో ఎదురైన భారీ బండరాళ్లను పేలుళ్ల ద్వారా కాకుండా ప్రత్యేక రసాయన పద్ధతిలో ఎలాంటి ప్రకంపనలు లేకుండా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పంప్‌రూమ్ నిర్మాణ స్థలాన్ని సుమారు 100 మీటర్ల మేర పక్కకు మార్చినట్లు తెలిపారు. డ్యామ్‌తో పాటు పంప్ హౌ స్ నిర్మాణ ప్రాంతంలో రిజర్వాయర్ వైపు ఎలాంటి నీటి లీకేజీలు లేవని స్పష్టం చేశారు.

పంపు హౌస్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు అవసరం లేదని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ శివధర్మతేజ పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులతోనే పనులు కొనసాగుతున్నాయని, డ్యామ్ భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు.. బ్లాస్టింగ్‌ల వల్ల మల్లన్నసాగర్ కట్టకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ వివరణ ఇచ్చారు. వారి వెంట హెచ్‌ఎం డబ్ల్యూ ఎస్ జీఎం ఉమాపతి, ఎస్‌ఈ లక్ష్మణ్, మల్లన్నసాగర్ ఈఈ కవిత ఉన్నారు.

మరిన్ని వార్తలు