ఒక రోజు ఈఫిల్ టవర్ మూత

09-09-2026 | 05:15am
  1. మహిళ ఉద్యోగులను పక్కన పెట్టడంపై నిరసన
  2. వివాదానికి దారితీసిన ‘బాప్స్’ పర్యటన

పారిస్, సెప్టెంబర్ 8: పారిస్‌లోని ప్రసిద్ధ కట్టడమైన ఈఫిల్ టవర్‌ను(Eiffel Tower) సోమవారం ఒక రోజు మూసివేశారు. ఒక హిందూ సంస్థ (Hindu Organization) సందర్శన కోసం మహిళా ఉద్యోగులను వారి విధులకు దూరంగా ఉంచడంతో వారు సమ్మెకు దిగడమే ఇందుకు కారణమని యాజమాన్యం తెలిపింది. బాప్స్ (బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం) స్వామినారాయణ్ సంస్థకు చెందిన సుమారు 100 మంది వ్యక్తులు శనివారం టవర్‌ను సందర్శించినప్పుడు ఈ వివాదం తలెత్తింది.

ఈ సందర్శనకు ముందే ఇక్కడ సేవలందిస్తున్న మహిళలను నిర్వాహకులు పక్కన పెట్టారు. దీంతో మహిళా ఉద్యోగులు ఆగ్రహానికి గురై నిరసనలకు దిగారు. దీంతో ఈఫిల్ టవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బాప్స్ ప్రతినిధి బృందం ఫ్రాన్స్‌లోని ఒక హిందూ దేవాలయ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈఫిల్ టవర్‌ను సందర్శించాలని ముందే సంబంధిత యాజమాన్యానికి, నిర్వాహకులకు తెలియజేసింది.

దీంతో టవర్ నిర్వాహకులు మహిళా ఉద్యోగినుల స్థానంలో పురుష సిబ్బందిని విధుల్లో ఉండాలని ఆదేశించారు. దీనిపై టవర్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన తమ దృష్టికి రాలేదని ‘బాప్స్’ పేర్కొంది. ఏమైనా ఇలా జరగడంపై చింతిస్తున్నామని తమవల్ల ఎవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరింది. మరోవైపు పారిస్ మేయర్ ఇమ్మాన్యుయెల్ గ్రెగోయిర్ ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. 

మరిన్ని వార్తలు