త్వరలో పట్టాలపైకి స్వదేశీ బుల్లెట్ రైలు
- తొలి బాడీ ఫ్రేమ్ ఇప్పటికే సిద్ధమైంది
- 2027 మే లేదా జూన్ నాటికి టెస్టింగ్
- మొదట సూరత్ మధ్య పరుగులు
- కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
వడోదర/న్యూఢిల్లీ: దేశంలోనే తయారవుతున్న తొలి స్వదేశీ బుల్లెట్ రైలు త్వరలో పట్టాలపైకి రానుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Railway Minister Ashwini Vaishnaw) తెలిపారు. భారత్‌లో తయారవుతున్న బుల్లెట్ రైలు బాడీ ఫ్రేమ్ ఇప్పటికే సిద్ధమైందని వైష్ణవ్ వెల్లడించారు. 2027 మే లేదా జూన్ నాటికి ఈ రైలును పరీక్షల కోసం పట్టాలపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా పూర్తయిన అనంతరం దేశీయంగా తయారైన బుల్లెట్ రైలు సేవలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభిస్తారని చెప్పారు.
గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ఆయన రైల్వే రంగంలో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తయితే వడోదర నుంచి ముంబైకి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని మంత్రి తెలిపారు. ఈ మార్గంలో సుమారు గంటన్నరలోనే ముంబై చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
దేశీయంగా అత్యాధునిక రైల్వే సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా భారత్ రవాణా రంగంలో కొత్త దశలోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు ప్రాధాన్యతను కూడా వైష్ణవ్ వివరించారు. దాద్రీ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ) వరకు నిర్మించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తయిందని తెలిపారు. సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింద న్నారు.
2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం భూసేకరణ, నిధులు, డిజైన్ తదితర సమస్యలను పరిష్కరించి ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిందని తెలిపారు. ఆధునిక రైల్వే మౌలిక వసతులు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమని రైల్వే మంత్రి అన్నారు. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన సరుకు రవాణా, స్వదేశీ సాంకేతికతతో భారత రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరిస్తున్నామని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారత రైల్వే రంగం ప్రపంచస్థాయి మౌలిక వసతులతో మరింత బలోపేతం అవుతుందని వైష్ణవ్ పేర్కొన్నారు