యూపీలో కాంగ్రెస్కు 26 సీట్లే?
కాంగ్రెస్ అడిగింది 120.. ఎస్పీ ఇస్తామన్నది 26 స్థానాలే
ఇండియా కూటమిలో అసెంబ్లీ సీట్ల పంపకం రసవత్తరం
లక్నో, నవంబర్ 24: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) కాంగ్రెస్(Congress), సమాజ్వాదీ పార్టీల(Samajwadi Party) మధ్య సీట్ల సర్దుబాటు రసవత్తరంగా సాగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇండియా కూటమిలో(INDIA Alliance) అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ 100-120 అసెంబ్లీ స్థానాలు ఆశిస్తుండగా.. యూపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన సమాజ్వాదీ పార్టీ మాత్రం 26 సీట్లే ఆఫర్ చేసింది.
ఈ విషయాన్ని ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ మంగళవారం తెలిపారు. ఈ సంఖ్యతో కాంగ్రెస్ సంతృప్తి చెందే పరిస్థితి కనిపించడం లేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఎక్కువ స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. చర్చలు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్కు 60-70 కేటాయిస్తారా..!
తొలుత 181 అసెంబ్లీ స్థానాలు కోరిన కాంగ్రెస్కు సమాజ్ వాదీ పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో 100-120 స్థానాలతో కూడిన జాబితాను ఎస్పీ నాయకులకు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అందులో 55 స్థానాలను ‘ఎ’ కేటగిరీగా, గతంలో మంచి ఫలితాలు సాధించిన స్థానాలను ‘బి’ కేటగిరీగా, గెలుపు అవకాశాలున్న స్థానాలను ‘సీ’ కేటగిరీగా విభజించినట్లు సమాచారం. అయితే.. ఎస్పీ 26 స్థానాల ప్రతిపాదన చేయడంతో రెండు పార్టీల మధ్య సీట్ల అంతరం చాలా ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో జరిగిన తొలి విడత చర్చల్లో కాంగ్రెస్ యూపీ ఇంచార్జి రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొనగా.. ఎస్పీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. పొత్తుపై మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని రెండు పార్టీల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు 60-70 సీట్లు కేటాయిస్తే సరిపోతుందని పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు కొందరు ఎస్పీ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. అఖిలేష్, రాహుల్ మధ్య మంచి స్నేహం ఉన్నందున సీట్ల సర్దుబాటు సానుకూలంగానే ముగుస్తుందని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు.