నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు : మాజీ ఎంపీ నామ
వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం
బాధిత కుటుంబాన్ని ఆదుకున్న మాజీ ఎంపీ నామను అభినందించిన యువత
ఖమ్మం, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ. వేణుకుమార్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆదివారం బీఆర్‌ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆస్పత్రికి వెళ్లి వేణుకుమార్ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.
పరామర్శ సందర్భంగా వేణుకుమార్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నామ చలించిపోయి తన నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల రూపాయలు సోమవారం మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, ట్రస్ట్ ప్రతినిధి కనకమేడల సత్యనారాయణ చేతుల మీదుగా వేణుకుమార్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆదివారం వేణుకుమార్ నాయనమ్మకు ధైర్యం చెబుతూ ‘నేను అండగా ఉంటాను‘ అని భరోసా ఇచ్చిన నామ, చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ పరామర్శించిన మరుసటి రోజే ఆర్థిక సాయం అందించడం విశేషం. క్లిష్ట సమయంలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. నిరుద్యోగుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని నామ పేర్కొన్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, నిరుద్యోగ యువత ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆపద సమయంలో అండగా నిలిచి వెంటనే ఆర్థిక సహాయం అందించిన నామకు వేణుకుమార్ కుటుంబ సభ్యులు, నిరుద్యోగ యువత కృతజ్ఞతలు తెలిపారు.
వేణుకుమార్ ఒక్కడి సమస్య కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆవేదన: కమల్రాజు
ఈ సందర్భంగా కమల్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తోందని విమర్శించారు. 31 నెలల పాలనలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. వేణుకుమార్ ఆత్మహత్యాయత్నం నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని, నిరుద్యోగులు పడుతున్న వేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వేణుకుమార్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వారి నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు తెలిపారు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, వేణుకుమార్ కోలుకున్న అనంతరం అతనికి అవసరమైన కోచింగ్తో పాటు ఇతర అవసరాల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే గ్రూప్స్తో పాటు పెండింగ్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కేవలం వేణుకుమార్ ఒక్కరి సమస్య కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల సమస్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి ప్రసాద్రావు, గడ్డం వెంకటేశ్వర్లు, వాకదాని కోటేశ్వరరావు, పెనుగొండ కొండలు, నామ వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు, బీఆర్‌ఎస్ యువజన నాయకులు రేగళ్ల కృష్ణప్రసాద్, పగడాల రవికుమార్, షారుఖ్తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేణుకుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.






