కూటమికి ఐక్యతా సవాల్!
దేశంలో జెన్ జీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ప్రతిపక్ష ఇండీ కూటమి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. నీట్ సహా వివిధ ప్రశ్నాపత్రాల లీకులు, విద్యావ్యవస్థలో లోపాలు వంటి సమస్యలపై పోరాటంతో విపక్ష పాత్రను జెన్ జీ యువతరం భర్తీ చేసే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా ప్రాంతీయ పక్షాలు కలిపి మొత్తం 25 పార్టీలు హాజరవడం విశేషం.
అయితే, ఇండీ కూటమిలో మొదటి నుంచి కీలక పక్షంగా ఉంటూ వస్తున్న డీఎంకే, ఆప్ ఈ భేటీకి గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఐక్యతాస్ఫూర్తిని ప్రదర్శించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నొక్కి ఒక్కానించడం ఇండీ కూటమిలో నెలకొన్న విభేదాలను స్పష్టం చేస్తున్నది. వాస్తవానికి, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ కూటమి గణనీయమైన ప్రభావం చూపిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పలు పరిణామాల కారణంగా ఈ ఐక్యతకు బీటలు వారాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. తాను బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన మిత్రులను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం, తమ కంచుకోట లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను పట్టించుకోకపోవడం వల్లనే ఢిల్లీని ఆప్, పశ్చిమ బంగాల్‌ను తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడును డీఎంకే కోల్పోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఆప్, డీఎంకే లాంటి బలమైన పక్షాలు ఇండీ కూటమికి దూరమయ్యాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉమ్మడి కార్యాచరణ లేకపోవడం, అన్ని పార్టీలను ఏకతాటిపైకి నడిపించే సమర్థ నాయకత్వం లేకపోవడం, నిరుద్యోగం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ధరల పెరుగుదల, సమాఖ్య వ్యవస్థ వంటి అంశాలపై ఏకాభిప్రాయం కొరవడటం ఇండీ కూటమికి ప్రధాన సమస్యగా మారింది.
ఇలాంటి తరుణంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని విపక్ష కూటమి తీర్మానించుకోవడం ముదావహం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పక్షాన్ని ఎదుర్కోవడం కంటే, తమ ఐక్యతను నిలబెట్టుకోవడమే అసలు సవాలుగా మారిన నేపథ్యంలో ఇండీ కూటమి ఎలా ముందకెళ్తుందో చూడాలి.






