9 June, 2026 | 1:23 AM

సినిమాను మింగేస్తున్న భారీ బడ్జెట్

09-06-2026 12:00 AM

సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు విడదీయరాని అనుబంధం ఉన్నది. అలసట నుంచి కాస్త ఉపశమనం పొందడానికి, వారాంతంలో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి నాడు సినిమా థియేటర్ ఏకైక వేదిక. కానీ, మారుతున్న కాలంతో పాటు సినీరంగంలో సరికొత్త వ్యాపార ధోరణులు మొదలయ్యాయి. సినిమా బడ్జెట్ వందల కోట్ల రూపాయలకు చేరడం, పెట్టిన పెట్టుబడిని సాధ్యమైనంత త్వరగా రాబట్టాలనే తాపత్రయంతో టికెట్ ధరల ను భారీగా పెంచేయడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సర్వసాధారణమైపోయింది.

దీంతో ఒకప్పుడు సినిమాను ప్రేమించిన సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకుడు నేడు థియేటర్ వినోదమంటేనే భయపడుతున్నాడు. నాడు సినిమాలు హిట్ అయితే థియేటర్లలో వంద రోజులకు పైగా నడిచేవి. మరోవైపు ప్రభుత్వాలు సైతం టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునేవి. రిక్షా కార్మికుడి నుంచి సంపన్నుడి వరకు అందరూ ఒకే థియేటర్‌కు వెళ్లి సినిమా వీక్షించే అనవాయితీ కనిపించేది. టికెట్ ధర తక్కువగా ఉండటం వల్ల కొందరు ఒకే సినిమాను నాలుగైదు సార్లు చూసిన సందర్భాలూ ఉన్నాయి.

నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ గ్రాఫిక్స్, నటీనటుల ఆకాశాన్నంటే రెమ్యునరేషన్ల కారణంగా చిత్రాల బడ్జెట్ భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో, నిర్మాతలు లాంగ్ రన్ మీద కాకుండా, మొదటి వారంలోనే అనుకున్నంత కలెక్షన్లు రాబట్టడంపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యుడిని వినోదానికి దూరం చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని మరీ టికెట్ రేట్లను అడ్డగోలుగా పెంచేస్తున్నారు.

సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో సాధారణ ధరల కంటే రెట్టింపు వసూలు చేయడం, ప్రీమియర్ షోల పేరుతో వందల రూపాయలు గుంజడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. అభిమానుల కోసం ప్రదర్శించాల్సిన ప్రీమియర్ షోలకు కూడా అధిక ధరలు నిర్ణయించి, ఫ్యాన్స్ జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇక నేటి రోజుల్లో థీయేటర్‌కు వెళ్లి సినిమా చూడటం మధ్యతరగతి కుటుంబాలకు కలగానే మిగిలిందని చెప్పుకోవాలి. దానికి తోడు థియేటర్లలో విక్రయించే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు, పార్కింగ్ వసూళ్లు అన్నీ కలిపి తడిసి మోపెడవుతున్నది.

మరోవైపు టికెట్ల రేట్లు పెంపు విషయంలోనూ పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుండటం గమనా ర్హం. సినిమా కథను బట్టి కాకుండా హీరో కటౌట్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తుండటం శోచనీయం. మరోవైపు స్వరాష్ట్రం సాధించి పుష్కరకాలం గడిచినా ఆంధ్రా సినిమాలకే ఇక్కడి పాలకులు పెద్ద పీట వేస్తున్నారు. అడగగానే ఆంధ్ర నటులు, నిర్మాతల సినిమాలకు అడ్డూ అదుపూ లేకుండా టిక్కెట్ ధరలను పెంచుతున్నారు. 

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన డైరెక్టర్లు, నిర్మాతలు, నటీనటులు మన ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తెలంగాణ ప్రజల కష్టనష్టాలు, ఇక్కడి వీరుల పోరాటగాథలను వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల కారణంగా మన తెలంగాణ సినిమా లు పురిట్లోనే చనిపోతున్నాయి. భారీ బడ్జెట్‌ను తిరిగిరాబట్టేందుకు పెంచుతున్న టిక్కెట్ ధరలను చూసి ప్రేక్షకుడు థియేటర్ వైపు రావడమే మానేశాడు.

దీనివల్ల చిన్న సినిమాలపై ఎక్కువగా ప్రభావం పడుతున్నది. మరోవైపు మన ప్రాంత సినిమాలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండటం పెనుశాపంగా మారింది. ఎంతో కష్టపడి సినిమా తీస్తున్న చిన్న సినిమాల డైరెక్టర్లు ప్రేక్షకులను థియేటర్లకే రప్పించలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి తాత్కాలికంగా పెద్ద సినిమాలకు భారీగా కలెక్షన్లు తెచ్చిపెడుతున్నట్లు అనిపించినా, దీర్ఘకాలంలో చిత్ర పరిశ్రమ మనుగడకే ముప్పు గా పరిణమించే ప్రమాదం ఉంది.

పెద్ద సినిమాల రేట్ల పెంపు వల్ల ప్రేక్షకుడికి థియేటర్ అలవాటు తప్పుతోంది. తత్ఫలితంగా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు, సామాజిక చిత్రాలు విడుదలైనప్పుడు వాటిని థియేటర్లలో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. థియేటర్లకు జనాలు రాకపోవడంతో అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు కల్యాణ మండపాలుగా మారుతున్నాయి.

సినిమా అనేది వ్యాపారమే కాదు, కోట్ల మందికి వినోదాన్ని పంచే ఒక అద్భుతమైన కళారూపం. ధరల పెంపు సామాన్యుడి పరిధిని దాటిపోకూడదు. కొత్త తరం నిర్మాతలు, నటులు తమ రెమ్యునరేషన్లను, అనవసర నిర్మాణ ఖర్చులను నియంత్రించుకుని టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచినప్పుడే థియేటర్లకు పూర్వ వైభవం వస్తుంది. ప్రేక్షకుడు కూడా మళ్లీ సినిమాకు దగ్గరవుతాడు.

భవిత, జర్నలిస్టు