18 June, 2026 | 1:50 AM

జాడలేని వాన.. కాలం కలిసొచ్చేనా..?

18-06-2026 12:24 AM

ఊరిస్తున్న మబ్బులు - ఉసూరుమనిపిస్తున్న వానలు

మండకోడీగా దుక్కులు - ఆశగా ఎదిరి చూస్తున్న రైతులు

ఎల్ నినో ఎఫెక్ట్

ఆరుతడి పంటలు బెస్ట్? 

నేరేడుచర్ల, జూన్ 17 : వర్షాకాలం మొదలైనా ఇప్పటి వరకు సరైన వర్షం పడక పోవడంతో వానకాలం సాగుకు కష్టకాలం వచ్చింది. నైరుతి రుతుపవనాలు మందగించడంతో వర్షాలు కురియడం లేదు. మృగ శిర కార్తె గడిచిపోయినప్పటికీ చిన్నపాటి జల్లులే కురిశాయి. వానకాలం ప్రారంభమై 16 రోజులు గడుస్తున్నా, కేవలం చిరు జ ల్లులు మాత్రమే అడపాదడపా పడ్డాయి. కురిసిన జల్లులు కూడా వేడి పెనం మీద నీళ్లు చల్లిన చందంగా ఆవిరై పోయాయి.

ఈ పాటికే తొలకరి వర్షాలు విస్తారంగా కురిసి, ముమ్మురంగా దుక్కులు దున్నుతూ, విత్తనాలు సేకరించడం వేయడం, అడుగు మందు (పిండి కట్టలు) కొని ఉంచడం లాంటి పనులు ముమ్మరంగా చేపట్టి వ్యవసాయ పనుల్లో రైతులు బిజీబిజీగా ఉండాల్సి ఉంది. కానీ వర్షాలు కురియకపోవ డంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. వర్షాల కోసం రైతులు ఎదురుచూ పులు చూస్తున్నారు. జూన్ నెల ప్రారంభమై 17 రోజులు గడిచినా నేటికీ నేరేడుచర్ల మండలంలో కేవలం 28.4 మిల్లిమీటర్ల వర్షపాతం మా త్రమే కురిసింది. బోర్లు బావులు మీద ఆధారపడ్డ రైతులు మాత్ర మే ధైర్యంగా దుక్కులు దున్నే పనిలో ఉండగా, ఏ ఆధారం లేని రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

 ఎల్ నినో ఎఫెక్ట్ --ఆరుతడి పంటలు బెస్ట్ : 

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయని, వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలు ఆరుతడి పంటల వైపు దృష్టిసారించాలని వ్యవసాయ   అధికారులు, నిపుణులు చెబుతున్నారు. వర్షాలు తగ్గడం వల్ల కరవు పరిస్థితులు, వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉందని, పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న వనరులతో పాటు మారుతున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలతో పాటు, వర్షాలు, ఎక్కువగా నీటిపై ఆధారపడే వారు ఖరీఫ్ లో వర్షాధారంగా లేదా తక్కువ నీటి తడులతో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడంపై ఎంతో అవసరం ఉంది.

నీటి లభ్యతను బట్టి పంటలు సాగుచేయాలి 

బోర్లు, బావుల ద్వారా నీటి ఆధారం ఉన్న రైతులు తమకున్న వ్యవసాయ విస్తీర్ణంలో కొంత భాగాన్ని వరి పంట కోసo,మిగిలిన భాగoలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి, అలాగే ఏ నీటి ఆధారం లేని రైతులు ఆరుతడి పంటలు అయిన కందులు, సజ్జలు పెసర్లు మినుములు, బొబ్బర్లు అలసందలు, నూనె పంటలు అయిన నువ్వులు, వేరు శనగ లను సాగు చేయడం ఉత్తమం.ఆరుతడి పంటలు వేయడం వల్ల పెట్టుబడి, ఖర్చులు తగ్గి, రైతుకు లాభదాయకంగా ఉంటుంది.

షేక్. జావిద్, మండల వ్యవసాయ అధికారి,  నేరేడుచర్ల