వేగంగా పూడికతీత
శాస్త్రీయ పద్ధతిలో అత్యుత్తమ ప్రణాళిక
- నీటిప్రాజెక్టుల పూర్తి నిల్వసామర్థ్యానికి చర్యలు
- దేశంలోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలి
- అనువైన పద్ధతిని తెలంగాణకు అన్వయించాలి
- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాల్లో పూడిక తొలగింపు (డీసిల్టేషన్) కోసం అత్యుత్తమ, సమగ్రమైన, శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళికలు రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పూడికతీతే లక్ష్యంగా తక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా, దీర్ఘకాలిక వరద నియంత్రణ అవసరాలకు కూడా ఉపయోగపడాలన్నారు.
లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు రిజర్వాయర్‌లో పూడిక తొలగింపు పనుల్లో వేగం పెంచాలని, ఇందుకు ఉన్న అడ్డంకుల పరిష్కారాలను అన్వేషించాలన్నారు. అదేవిధంగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజె క్టులపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో జలాశయాలు, నీటిపారుదల ప్రాజెక్టులలో పూడిక తొలగింపు కార్యక్రమాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాల అసలు నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. జలాశయాల నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల నీటి భద్రత మెరుగుపడటంతో పాటు సాగునీటి విస్తీర్ణం పెరుగుతుందని, వరద ముప్పు కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పూడిక తొలగింపు నమూనాలను సమగ్రంగా అధ్యయనం చేసి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయగల ఉత్తమ విధానాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా జలాశయాల్లో పూడిక నిర్వహణ, పూడిక తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ మార్గదర్శకాలు, విధానాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను ప్రస్తావిస్తూ, పూడిక తొలగింపు వంటి నివారణ చర్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
గత ఏడాది పంజాబ్ రాష్ట్రంలో సంభవించిన తీవ్ర వరదల కారణంగా 22 జిల్లాల్లో 16 జిల్లాలు ముంపునకు గురయ్యాయని, నష్టపరిహారం, పునరుద్ధరణ చర్యల కోసం దాదాపు రూ.2,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. సకాలంలో పూడిక తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థలు, జలాశయాల నిల్వ సామర్థ్యాల పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టినట్లయితే ఆ వ్యయంలో గణనీయమైన భాగాన్ని నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
పాలక్కాడ్ నమూనా పరిశీలించాలి
కేరళం రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని మంగళం ఆనకట్టలో 2017లో చేపట్టిన పూడిక తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతమైన నమూనాగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావించారు. శాస్త్రీయ పద్ధతిలో చేపట్టిన ఆ కార్యక్రమం ద్వారా జలాశయంలో పేరుకుపోయిన పూడిక సమస్యను పరిష్కరించడమే కాకుండా, తవ్వి తీసిన మట్టిని వినియోగించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సాధించారని తెలిపారు.
అలాంటి విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయగల మార్గాలను పరిశీలించాలని ఆయన సూచించారు. కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు పనులు చేపడుతున్న సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సమీక్షించారు. అలాగే లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ), మిడ్ మానేరు రిజర్వాయర్ (ఎంఎంఆర్)లో జరుగుతున్న పూడిక తొలగింపు పనుల పురోగతిని కూడా సమీక్షించారు. అడ్డంకులను తొలగించేందుకు పరిష్కారాలను గుర్తించాలన్నారు.






