12 July, 2026 | 2:25 AM

నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్ర మంగ

12-07-2026 01:08 AM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్‌బాబు ఓ శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు.

నిర్మాత పీ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్వినిదత్ సమర్పిస్తున్నారు.  ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాషా తడాని విలేకరులతో పంచుకున్న సినిమా విశేషాలు ఆమె మాటల్లోనే.. 

* ‘శ్రీనివాస మంగాపురం’ లాంటి మంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అజయ్ భూపతికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలను చాలా బాగా డిజైన్ చేస్తారు. ఇందులో కూడా నా పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేశా. మంగ పాత్ర నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్, లవ్‌తోపాటు కామెడీ కూడా ఉంటుంది.

* నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. ‘బాహుబలి’ నాకు ఎంతో నచ్చిన సినిమా. తెలుగు సినిమా చాలా అడ్వాన్స్‌గా ఉంది. ప్రతి సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఇలాంటి పరిశ్రమలో తప్పకుండా పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.  

* ఈ కథను నేను -గత ఏడాది జూలైలో విన్నా. దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పిన విధానం, పాత్రలను, అందులోని ప్రేమ, భావోద్వేగాలను తీర్చిదిద్దిన తీరు నాకు ఎంతగానో నచ్చాయి. కథ వింటున్నప్పుడు ఆయన ప్రతి పాత్రను ఎంతగా ప్రేమించారో నాకు అర్థమైంది. ఆ ఎమోషన్‌ను నేను కూడా ఫీల్ అయ్యా. ఇది చాలా అద్భుతమైన కథ.

* ఇందులో -నా పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకవైపు చాలా బబ్లీగా, ఎక్సైటైడ్‌గా ఉంటుంది. మరోవైపు చాలా పద్ధతిగా, హుందాగా ఉండే అమ్మాయిగా కనిపిస్తుంది. ఇలా నా పాత్రకు రెండు విభిన్న కోణాలున్నాయి.

* ఇది తెలుగులో నా మొదటి సినిమా కాబట్టి కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలుత డైలాగులు అర్థం చేసుకోవ డానికి కాస్త కష్టపడ్డా. -నాకు తెలుగు అర్థమవుతుంది. కానీ స్పష్టంగా మాట్లాడలేను. దర్శకుడు అజయ్ భూపతి ప్రతి డైలాగ్, అందులోని భావోద్వేగాన్ని దగ్గరుండి నేర్పించారు.  

* జయకృష్ణ చాలా స్వీట్ అండ్ కూల్ పర్సన్. సెట్లో చాలా సరదాగా వుంటారు. షూటింగ్ సమయంలో చాలా ఫన్ ఉండేది. -మా అమ్మ రవీనా టాండన్ మోహన్‌బాబుతో కలిసి పనిచేశారు. ఆయనతో పనిచేయడం చాలా ఫన్ ఎక్స్‌పీరియెన్స్. సెట్లో ఎప్పుడూ జోకులు చెబుతూ ఉంటారు. ఆయన అనుభవం మాకు ఎంతో ఉపయోగపడింది.  

* వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ సంస్థ నుంచి మహేశ్‌బాబుతోపాటు ఎంతో మంది స్టార్స్ పరిచయం అయ్యారు. నా జీవితంలో కలిసిన మంచి వ్యక్తుల్లో అశ్వినిదత్ ఒకరు. ఆయన నన్ను ఎప్పుడూ మనవరాలిలా చూసుకునేవారు. ఏది కావాలన్నా అడగమని చెప్పేవారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలు చూసినప్పటికీ ఆయన ఎంతో వినయంగా, డౌన్ టు ఎర్త్ ఉంటారు. 

* తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన వాతావరణం ఉంటుందని మా అమ్మ నాకు చెప్పారు. తెలుగు భాష నేర్చుకోమని సలహా ఇచ్చారు. ఆమె చెప్పినట్టుగానే తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. -నేను తెలుగు సినిమా చేయడం మా నాన్నకు చాలా ఆనందాన్నిచ్చింది. ఆయనకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం.