28 August, 2026 | 4:53 AM

మాదాపూర్ లో సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ

27-08-2026 11:21 PM

ఇచ్చోడ,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామంలో గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన 13 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

యువత గంజాయికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు పరస్పరం సోదరభావంతో, ఐకమత్యంగా ఉంటూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్, గ్రామ సర్పంచ్ షేక్ ఇమ్రాన్, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.