12 July, 2026 | 2:28 AM

గగనానికేగిన మన గాయనీమణి.. జానకమ్మ ఇకలేరు

12-07-2026 01:44 AM

ఎస్ జానకి (1938-2026)

  1. మైసూర్ ఆసుపత్రిలో గుండెపోటుతో హఠాన్మరణం 
  2. సినీ, రాజకీయ రంగాల ప్రముఖుల తీవ్ర సంతాపం 
  3.   17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు 
  4.   4 సార్లు జాతీయ సినీ అవార్డులు

* సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని చాలించి దక్షిణాది స్వరకోకిల ఎస్ జానకి (88) కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన గాన మధు ర్యంతో  భారతీయ సంగీత చరిత్రను ఎస్ జానకి ఓలలాడించారు. తెలుగు పాట ఓ చక్కని స్వరాన్ని కోల్పోయింది. జానకమ్మ మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. దక్షిణాది సినీ పరిశ్రమలు, సంగీత విద్వాంసులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.

సుస్వరాల సువ్వాలమ్మ

పసిపాప గొంతు నుంచి వృద్ధురాలి మూలుగే స్వరం వరకు.. శృంగార రసం నుంచి శోకగీతం వరకు ప్రతి భావాన్ని గళంలో పలికించిన అద్భుత స్వర సరస్వతి ఆమె. లాలిపాట నుంచి ప్రణయ గీతాల వరకు జానకమ్మ పాడిన అజరామర గీతాలు వేనవేలు. తెలుగునాట ప్రతి ఇంటి గుమ్మంలో ఆమె పాటలు వినిస్తూనే ఉంటాయి. భాషతో సంబంధం లేకుండా, భావమే ప్రాణంగా సాగిన ఎస్ జానకి సుదీర్ఘ గాన ప్రస్థానం ముగిసింది. 

రేడియోలో వారి పాటలు వింటూ.. 

స్వీయ శిక్షణ, ప్రేరణతోనే ఆమె పాడటం నేర్చుకున్నారు. సినిమా పాటల అనుకరణ కూడా అంతే. చిన్న వయసులోనే రేడియోలో వచ్చే లతా మంగేష్కర్, పీ లీల, జిక్కి, పీ సుశీల వంటి దిగ్గజ గాయనుల పాటలను విని, వాటిని అనుకరిస్తూ సొంతంగా పాడటం సాధన చేసేవారు. 

* ‘పాడనా తెనుగు పాట.. పరవశనై మీ ఎదుట..’, ‘పగలే వెన్నెలా..’, ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య..’, ‘సువ్వి సువ్వి సువ్వాలమ్మ..’ అంటూ తెలుగువారి ప్రతి భావానికి, ప్రతి పండుగకు తన గళాన్ని అద్దిన స్వరకోకిల ఎస్ జానకి. 

* ‘నీ లీలా పాడెద దేవా..’, ‘సిరిమల్లె చెట్టు కింద..’, ‘గోరువంక వాలింది..’, ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా..’ అంటూ తెలుగువారి గుండె గూటిలో దశాబ్దాలుగా మధురామృతాన్ని కురిపించిన అమరగాత్రం జానకమ్మ సొంతం. 

* ‘జగమే మారినది.. గిరిజా కల్యాణం..’, ‘కిలకిల కిలలు శ్రుతిలయలుగా..’,

‘ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ..’ వంటి లెక్కలేనన్ని క్లాసిక్ గీతాలతో తెలుగు జన జీవన 

స్రవంతిలో భాగమైన లెజెండరీ సింగర్ ఎస్ జానకి. 

దిగ్గజ గాయని ఎస్ జానకి (88) శనివారం భౌతిక కాయాన్ని విడిచారు. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల వల్ల మైసూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయా న్ని ఆమె మనవరాలు అప్సర విద్యుల ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. భౌతికంగా ఆమె మనకు దూరమైనా, ఆమె పాడిన వేలాది అజరామర గీతాల రూపంలో జానకమ్మ ప్రతి సంగీత ప్రియుడి గుండె చప్పుడులో జీవించే ఉంటారు.

పల్లపట్ల నుంచి పాటల ప్రపంచానికి..  

ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుం టూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్లలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకుని, అనంతరం చెన్నైకి వెళ్లి సినీ గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో సినీ గానరంగంలో అడుగుపెట్టిన ఆమె, దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన అసా ధారణ సంగీత ప్రయాణంలో వేలాది పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో కూడా పాటలు పాడి విశేష గుర్తింపు పొందారు. 

సంగీత శిక్షణ లేని గానగంధర్వ.. 

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన గానగంధర్వ ఎస్ జానకి. ఎలాంటి అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణ లేకుండానే, కేవలం దైవదత్తమైన ప్రతిభతో సినీ సంగీతాన్ని తన అమృత గాత్రంతో ఆరు దశాబ్దాల పాటు ఓలలా డించిన ‘దక్షిణ భారత కోకిల’ ఎస్ జానకి. ఎలాంటి అధికారిక సంగీత శిక్షణ లేకపోయినా, శబ్ద ఉచ్ఛారణలోనూ, భావ ప్రకటనలోనూ ఆమె చూపిన ప్రతిభ అనన్యసామాన్యం.

భారతీయ సినీ సంగీతంలో అత్యంత భావవ్యక్తీకరణ కలిగిన గాయనీమణులలో ఎస్ జానకి ఒకరు. ఒకే గాత్రంతో ప్రేమ, విర హం, భక్తి, జోలపాట, జానపదం, హాస్యం వంటి విభిన్న భావాలను సమానంగా పలికించ గలిగిన అరుదైన కళాకారిణి. 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలతో కోట్లాది మంది హృదయాల్లో నిలిచారు జానకమ్మ. 

కుటుంబ నేపథ్యం.. 

జానకి తల్లిదండ్రులు సిస్ట్లా శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులు. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. జానకికి 1959లో వీ రామప్రసాద్‌తో వివాహం జరిగింది. జానకి సంగీత ప్రయాణానికి రామప్రసాద్ ఎంతో అండగా నిలిచారు. ఆమె రికార్డింగ్‌ల సమయంలో ఆయన తోడుగా ఉండేవారు. జానకి తన విజయాల్లో భర్త ప్రోత్సాహం ఎంతో ఉందని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. రామప్రసాద్ 1997లో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత జానకి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఆయనకు నివాళిగా ఆమె రంగుల బోర్డర్లు లేదా జరీ అంచులు లేని సాదా చీరలనే ధరించడం ప్రారంభించారు. ఎస్ జానకి ఏకైక కొడుకు పేరు మురళీకృష్ణ. ఆయన ఇదే ఏడాది జనవరి 22న గుండెపోటుతో మరణించారు. మురళీకృష్ణ ఒక గిటారిస్ట్. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా ‘శ్రుతిలయలు’లో ఒక చిన్న పాత్రలో నటించారు. మరణించడానికి ముందు కొన్నేళ్లుగా ఆయన తన తల్లితోనే కలిసి మైసూర్‌లో నివసించారు. కొడుకు మరణించిన ఐదు నెలల తర్వాత, వృద్ధాప్య సమస్యల కారణంగా జానకి పరపదించారు. 

తెలుగు చిత్రసీమలో స్వర్ణయుగం 

తెలుగు చిత్రసీమలో ఆమె స్వరం ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి మహా గాయకులతో కలిసి ఎన్నో చిరస్మరణీయ యుగళగీతాలకు ప్రాణం పోసింది. అలాగే కేవీ మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, ఎంఎం కీరవాణి వంటి ప్రముఖ సంగీత దర్శకుల స్వరాల్లో ఆమె పాడిన పాటలు చిరస్థాయిగా నిలిచాయి. ప్రత్యేకించి ఇళయరాజాతో ఆమె కలయిక దక్షిణ భారత సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఆమె స్వరంలోని మాధుర్యం, పదోచ్ఛారణలోని స్పష్టత, భావవ్యక్తీకరణలోని సహజత్వం తదుపరి తరాల గాయనులకు ఆదర్శంగా నిలిచాయి. ఆమె పాడిన పాటలెన్నో ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో పదిలంగా ఉన్నాయి.

ముఖ్యంగా ‘తొలిసారి మిమ్మల్ని (శ్రీవారికి ప్రేమలేఖ), ‘మంచు కురిసే వేళలో..’, ‘అరె ఏమైందీ..’ (అభినందన), ‘బంతి చామంతి..’ (అభిలాష), ‘సిరిమల్లె పువ్వా.. (పదహారేళ్ల వయసు), ‘మౌనమేలనోయి..’ (సాగర సంగమం), ‘ప్రియతమా నా హృదయమా..’ (ప్రేమ), ‘అందాలలో..’ (జగదేక వీరుడు అతిలోక సుందరి), ‘ఈ దుర్యోధన దుశ్శాసన..’ (ప్రతిఘటన), ‘మాటే మంత్రము..’ (సీతాకోక చిలుక), ‘సుందరి నీవే..’ (దళపతి) వంటి సూపర్‌హిట్ పాటలెన్నో ఆమె పాడారు. కోట్లాది మంది హృదయాలను తన గానంతో ఓలలాడించిన దక్షిణాది స్వరకోకిల ఎస్ జానకి. తరాల అంతరాలను తుడిచేస్తూ, కొన్ని కోట్ల మందికి జోలపాటగా, మరెందరికో ప్రేమ గీతంగా మారిన మధురమైన గొంతు జానకమ్మది. 

సరిగమలు వదిలేసి.. 

జానకి కి జన్మతః అద్భుతమైన స్వరజ్ఞానం ఉందని గుర్తించిన గురువు పైడిస్వామి, ఆమెకు సరిగమలు వదిలేసి అంటే.. సాధారణ స్వరాల నుంచి కాకుండా నేరుగా ‘నగుమోము గనలేని’ వంటి క్లిష్టమైన కీర్తనల నుంచే ఒకేసారి శిక్షణ ప్రారంభించారు. 

దైవదత్త వరమైన గాత్రం.. 

మహోన్నత గాయనిగా గుర్తింపు పొందిన జానకి ఎలాంటి అధికారిక, సాంప్రదాయక శాస్త్రీ య సంగీత శిక్షణ విస్తృతంగా తీసుకోలేదు. తన సహజసిద్ధమైన దైవదత్త వరమైన గాత్రం, అంకి తభావంతోనే ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్ర మలో గానకోకిలగా ఎదిగారు. అయితే, ఆమెకు ప్రాథమిక సంగీత పాఠాలు నేర్పిన తొలి గురువు గాడవల్లి పైడిస్వామి. జానకి కుటుంబం రాజమం డ్రిలో ఉన్నప్పుడు ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడైన పైడిస్వామి వద్ద జానకమ్మ సంగీతంలో ప్రాథమిక సూత్రాలు (బేసిక్స్), కొన్ని కీర్తనలు నేర్చుకున్నారు. కొవ్వూరులో ఉన్నప్పుడు వారణాసి బాలరామ య్య వద్ద కూడా ఆమె కొన్ని కీర్తనలు నేర్చుకున్నారు. 

మలుపు తిప్పిన ‘ఆల్ ఇండియా రేడియో’ పాటల పోటీ.. 

1956లో 18 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన లలిత సంగీతం పోటీల్లో జానకి ద్వితీయ బహుమతి సాధించారు. ఇది ఆమె సంగీత ప్రయాణంలో పెద్ద మలుపుగా నిలిచింది. ఆమె సంగీతంలో అసాధారణ ప్రతిభ కన బర్చారు. శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు లేదా సంవత్సరాల తరబడి శిక్షణ లేకపోయినప్పటికీ, క్లిష్టమైన రాగాలను సైతం ఆమె అలవోకగా పలికించేవారు. ముఖ్యంగా ఆమెకున్న వాయిస్ మాడ్యులేషన్ (గొంతును మార్చడం), భావ వ్యక్తీకరణ నైపుణ్యం వల్ల ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల ముసలమ్మ వరకు ఏ పాత్రకైనా సరిపోయేలా పాడేవారు. 

పద్మ అవార్డును తిరస్కరించి..  

ఎస్ జానకి నాలుగు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు. తెలుగు, తమిళం, కేరళ, కర్ణాటక ప్రభుత్వాల నుంచి కలిపి 33 రాష్ట్ర స్థాయి పురస్కారాలు తీసుకున్నారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని 2013లో ప్రకటించింది. అయితే, దక్షిణ భారత కళాకారులకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తోందన్న కారణంతో వినయపూర్వకంగా తిరస్కరించడం కూడా ఆమె వ్యక్తిత్వంలోని విశిష్ట అంశంగా గుర్తించబడింది.  

సిరిసిల్ల వాసిగా గర్వకారణం: కేసీఆర్

60 యేండ్ల సంగీత జీవితంలో దాదాపు 50 వేల పాటలు పాడి, భారత సంగీతవనంలో పాటల కుసుమాలను పూయించిన మహోన్నత గాయని. సినీ సంగీత జగత్తుకు చేసిన కృషి దేశ సాంస్కృతిక రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించించారు. దక్షిణాది కళాకారులకు జరుగుతున్న సాంస్కృతిక అన్యాయాన్ని సహిం చలేక భారత ప్రభుత్వం తనకు 2013లో ప్రకటించిన ‘పద్మభూషణ్’ అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన ధీర వనిత.

అన్ని రకాల పాత్రలకు తగ్గట్టుగా తన గాత్రాన్ని పాటగా మలిచి, సందర్భానికి తగ్గట్టుగా గమకాలతో నవరసాలను తన గానంలో నింపుకొని గానామృతాన్ని పం చిన జానకమ్మ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచారు. తండ్రి ఉద్యోగరీత్యా నాటి కరీంనగర్ జిల్లా జీవించడం, వారి కుటుంబం సిరిసిల్ల వా సులు కావడం తెలంగాణకు గర్వకారణం. ఆమె మరణం ముఖ్యంగా, దక్షి ణ భారత సంగీతానికి, పాటకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థి స్తున్నా. వారి కుటుంబ స భ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.  

* జానకమ్మ మృతి పట్ల దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్ జానకి మరణం భారతీయ సంగీతానికి తీరని లోటని, స్వర కోకిలగా ఆమె అందించిన పాటలు చిరస్మరణీయమని ఏపీ చంద్రబాబు పేర్కొన్నారు. దక్షిణాది 

చిత్ర పరిశ్రమ ఒక అద్భుతమైన స్వర శిఖరాన్ని కోల్పోయిందని, సంగీత సామ్రాజ్యంలో ఆమె స్థానం భర్తీ చేయలేనిదని తమ సంతాప సందేశాల్లో కమల్ హాసన్, రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. వివిధ భాషల్లో వేలాది పాటలతో ఎన్నో తరాల హృదయాలను గెలుచుకున్న మహోన్నత గాయని జానకమ్మ అని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శ్లాఘించారు. 

బహుభాషా కోకిల: రేవంత్ రెడ్డి 

బహుభాషా కోకిలగా గుర్తింపు తెచ్చుకున్న జానకమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. 

ఎంతో బాధాకరం: కేటీఆర్ 

తన మధురమైన గాత్రంతో నవరసాలు పండించగలిగే దిగ్గజ గాయని ఎస్ జానకి. తన బాల్యంలో కొన్నేళ్లు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారు. జానకి మరణం సంగీత ప్రపంచానికి, భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు.  

మీ స్వరం అమరం: చిరంజీవి

‘నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు.. ఆ జ్ఞాపకాలు.. మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జాన కమ్మ ఒక గాయని మాత్రమే కాదు.. భావా న్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి.

ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాప కం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పో యాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉం టుంది. ఎస్ జానకి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. జానకమ్మ... మీ స్వరం ఎప్పటికీ అమరం’ అని పేర్కొన్నారు. 

మా కుటుంబంతో దశాబ్దాల అనుబంధం: బాలకృష్ణ 

లెజెండరీ సింగర్ జానకి అమ్మ ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకి అమ్మ ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు.

మా నాన్న నందమూరి తారకరామారావు చిత్రాలతోపాటు నా చిత్రాల్లోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు ఎంతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.