16 April, 2026 | 3:28 AM

ప్రజావాణికి 141 ఫిర్యాదులు

24-11-2025 05:01 PM

గద్వాల: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు సమర్పించిన దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావులతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 141 అర్జీల్లో, 106 అర్జీలు రెండు పడకల ఇండ్లకు సంబంధించగా, మిగతా 35 అర్జీలు రెవెన్యూ, ఇతర విభాగాలకు సంబంధించి స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.