15 July, 2026 | 1:50 AM

బ్యాంకు మూరెడు.. ఖాతాలు బారెడు!

15-07-2026 01:49 AM
  1. బ్యాంకు మూరేడు.. ఖాతాలు బారెడు!
  2. ఇబ్బందుల్లో ఎస్బిఐ ఖాతాదారులు 

కేసముద్రం, జులై 14 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు అసౌకర్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎస్బిఐ, ఎస్బిహెచ్ శాఖలు వేరువేరుగా ఉండగా ఆ తరువాత రెండు బ్యాంకులు విలీనమయ్యాయి. రెండు బ్యాంకులు విలీనం కాకముందు ఎస్బిఐ ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో నిర్వహిస్తుండగా, ఎస్బిహెచ్ కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని ప్రభుత్వ భవనంలో నిర్వహించే వారు.

రెండు బ్యాంకులను విలీనం చేసిన తర్వాత కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని ప్రభుత్వ బిల్డింగ్ శిథిలం కావడంతో ఆ బ్యాంకు శాఖను కూడా ప్రైవేటు వ్యక్తి భవనంలో నిర్వహిస్తున్న ఎస్బిఐలోకి విలీనం చేశారు. దీనితో ప్రస్తుతం ఈ రెండు శాఖలకు సంబంధించిన ఖాతాలు 70 వేలకు పైగా ఉన్నాయి. రెండు బ్యాంకులను విలీనం చేసినప్పటికీ ఖాతాదారులకు అవసరమైన సౌకర్యాలతో కూడిన బ్యాంకు భవనాన్ని విస్తరించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ప్రస్తుతం బ్యాంకు నిర్వహిస్తున్న భవనం ఇరుకుగా మారడంతో పాటు, కనీసం వందమంది ఖాతాదారులు ఏక సమయములో బ్యాంకులో తమ కార్యకలాపాలను కొనసాగించే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు బ్యాంకులో లాకర్లు, గోల్ లోన్లు, వ్యవసాయ, వ్యవసాయేతర, ఇతర వివిధ రకాల రుణాలను పొందేవారు కూడా నిత్యం బ్యాంకుకు వస్తుంటారు. అలాగే సేవింగ్స్ బ్యాంక్, ఆర్టిజిఎస్, ఇతర నగదు లావాదేవీల చెల్లింపులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ, పథకాలకు సంబంధించిన ఖాతాలు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు కూడా ఇక్కడే ఉండడం వల్ల నిత్యం వందల సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుకు వస్తుంటారు.

వారు బ్యాంకులో కూర్చోవడానికి సరైన వసతి లేకపోవడంతో పాటు వారికి అవసరమైన టాయిలెట్లు, మరుగుదొడ్లు లేవని, వాహనాల పార్కింగ్ కూడా లేదని, బ్యాంకులో గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి లేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. రెండు బ్యాంకులను విలీనం చేసే సమయంలో అదనంగా వసతి ఉన్న భవనంలో ఏర్పాటు చేయకుండా గతంలో ఎస్బిఐ నిర్వహించిన భవనంలోనే ఎస్బిహెచ్ ను కూడా విలీనం చేసి అందులోనే నిర్వహిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

బ్యాంకులో నిత్యం జనం రద్దీతో ఇబ్బందిగా మారడంతో ఖాతాదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఖాతాదారులకు అనుగుణంగా కేసముద్రం పట్టణంలో ఎస్ బి ఐ శాఖకు సరైన వసతి కల్పించాలని కోరుతున్నారు.