బిరబిరా కృష్ణమ్మ పరుగులు!
- పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వెట్న్ విజయవంతం
- 22 రోజుల పాటు నీటి ఎత్తిపోత
- నాలుగు వారాల్లో మరో మూడు మోటార్లు ప్రారంభానికి సిద్ధం
- ఫలించిన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
నాగర్‌కర్నూల్/కొల్లాపూర్ రూరల్ , జూలై 14 (విజయక్రాంతి): పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండో రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రక్రియలో కీలకమైన వెట్న్‌న్రు మంగళవారం అధికారులు విజయవంతంగా ప్రారంభించారు. నార్లాపూర్ పంప్‌హౌస్‌లో మోటార్లను పరీక్షిస్తూ నీటిని ఎత్తిపోసే ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, సూపరింటెండెంట్ ఇన్‌చార్జి రవీందర్ వెట్న్ ప్రారంభించి, నీటిని విడుదల చేశారు.
మొదటి పంప్‌హౌస్‌లోని నాలుగు పంపుల్లో ప్రస్తుతం ఒక పంపుతో వెట్న్ నిర్వహిస్తుండగా, నీటిని వరుసగా రెండో, మూడో రిజర్వాయర్ల వరకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా మోటార్లు, పంపులు, విద్యుత్ వ్యవస్థల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారుల ప్రణాళిక ప్రకారం 22 రోజుల పాటు నిరంతరంగా వెట్న్ కొనసాగనుంది. ఈ వెట్న్ విజయవంతం కావడంతో పాలమూరు- ఎత్తిపోతల పథకం అమలులో మరో కీలక ముందడుగు పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
తొలి దశలో మొత్తం నాలుగు పంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో మొదటి పంపును 2023లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల నీటి ఎత్తిపోతలను కొనసాగించడం సాధ్యపడలేదని చెప్పారు. కాగా బడ్జెట్ కేటాయింపులు మరమ్మతు పనుల పురోగతిని సమీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గత నెల నేరుగా పర్యటించారని పేర్కొన్నారు. అడ్డంకులను తొలగించుకుంటూ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం అన్ని సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటర్ ద్వారా నార్లపూర్ రిజర్వాయర్‌లో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసి, ప్రతి వారం ఒక మోటార్ చొప్పున ప్రారంభిస్తూ నాలుగు వారాల్లో మరో మూడు మోటార్లను పూర్తిస్థాయిలో పనిచేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం నీటిని ఎత్తిపోసి తదుపరి దశలకు తరలించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఈ పథకం ద్వారా నీటిని ఎల్లూరు కేఎల్‌కు పంపించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామాలకు తాగునీటిని అందించడంతో పాటు భవిష్యత్తులో సాగునీటి అవసరాలను కూడా తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు వ్యవసాయ రంగానికీ ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.






