క్షుద్రపూజల బెదిరింపు.. హత్య కేసులో నిందితుని అరెస్ట్

16-09-2026 | 08:49pm

విలేకరుల సమావేశంలో వెల్లడించిన డిఎస్పి

టేకులపల్లి, (విజయక్రాంతి): తన కుమారుడు, మనవరాలిని క్షుద్రపూజలు చేసి చంపుతానని బెదిరించాడన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనను టేకులపల్లి సర్కిల్ పరిధిలోని ఆళ్లపల్లి పోలీసులు ఛేదించారు. సుద్దరేవు గ్రామానికి చెందిన కొమరం రామనాథం (59)ను అరెస్ట్‌ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు(Yellandu DSP Venkanna Babu) మంగళవారం టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో వెల్లడించారు.

ఆళ్లపల్లి మండలం మార్కోడ్‌ శివారులోని జల్లేరు వాగు వద్ద ఈ నెల 11న పూనేం నారాయణ అలియాస్‌ రామనారాయణ హత్యకు గురయ్యాడు. దర్యాప్తులో భాగంగా రామనాథాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ కొంతకాలంగా రామనాథం ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయ పనుల్లో సహకరిస్తుండేవాడు. మద్యం విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పేర్కొన్నారు. ఈ నెల 11న రాత్రి మద్యం సేవించి రామనాథం ఇంటికి వచ్చిన నారాయణ గొడవపడటంతో అతడిని బయటకు పంపించాడు.

అనంతరం రామనాథం కుమారుడు, మనవరాలిని క్షుద్రపూజలు(Black Magic) చేసి చంపుతానని నారాయణ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన రామనాథం రాత్రి 11 గంటల సమయంలో కత్తితో జల్లేరు వాగు వద్దకు వెళ్లి పూజలు చేస్తున్న నారాయణతో గొడవపడి ఛాతిలో పొడిచినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అనంతరం కత్తిని సమీపంలోని పొదల్లో పడేసినట్లు తెలిపారు. పంచుల సమక్షంలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాని మొత్తం పొడవు 21 సెం.మీ., బ్లేడ్‌ పొడవు 12 సెం.మీ.గా గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విలేకరుల సమావేశంలో టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్, టేకులపల్లి ఎస్సై తిరుపతి తిరుపతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు