25 June, 2026 | 4:55 PM

ఆదివాసీ ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన రేంజ్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

25-06-2026 04:22 PM

బీఆర్ఎస్ నేతలు

జైనూర్, జూన్ 25 (విజయ క్రాంతి) : ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అటవీ శాఖ రేంజ్ అధికారి రమేశ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఎన్నో ఏళ్లుగా పోడు రైతులు సాగు చేసుకుంటున్నారని, విత్తనాలు వేసే సమయంలో అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల్ పేర్కొన్నారు.

ఈ సమస్యపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇటీవల హైదరాబాద్‌లో పీసీసీఎఫ్ అధికారిణిని కలిసి పరిష్కరించాలని కోరారని, అలాగే జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో పోడు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులను ఆదుకుంటామని చెబుతూనే అటవీ అధికారులతో కావాలని పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడం ద్వంద్వ నీతి కాదా అని వారు ప్రశ్నించారు. ప్రతిసారీ పోడు చేయడానికి వెళ్లిన రైతులను అడ్డుకుంటున్న రేంజ్ అధికారి రమేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి కేవలం ఓట్ల కోసం పోడు భూముల పేరుతో రాజకీయం చేస్తున్నారని అవహేళనగా మాట్లాడారని ఆరోపించారు.

రాజకీయాలు చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ కండువా కప్పుకోవాలని, అధికారిగా ఉండి ఆదివాసీ ఎమ్మెల్యేపై రాజకీయ కామెంట్లు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ప్రశ్నించడం ఆమె బాధ్యత అని స్పష్టం చేశారు.అటవీ శాఖకు, పోడు రైతులకు మధ్య వైరుధ్యాలు రాకుండా సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, అలాంటి ఆమెపై ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారనడం రేంజ్ అధికారికి తగదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి కాంగ్రెస్ ప్రజాప్రతినిధిలా మాట్లాడటం సిగ్గుచేటని, ఇలాంటి అధికారుల వల్లే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని విమర్శించారు. రేంజ్ అధికారి వెంటనే క్షమాపణ చెప్పకపోతే పోడు రైతులతో కలిసి జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బావ్‌రావు, కుమ్రం శ్యాంరావు, మాజీ సర్పంచ్ మెస్రం నాగోరావు, మడావి నాగోరావు, అమృత్, మాజీ ఉప సర్పంచ్ ఖలీల్, నర్సింగ్, భాస్కర్, శ్రవణ్, ఉమాజీ, పోడు రైతులు పాల్గొన్నారు.